అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: పోలీసు సిబ్బందికి టీఏ, డీఏ అందక ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్లుగా తమకు అలవెన్సులు రావట్లేదని వాపోతున్నారు. ఈ విషయమై పలువురు సిబ్బంది మంగళవారం నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ధర్మపురిని కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పెండింగ్ అలవెన్సులు మంజూరు చేశారని, కమిషనరేట్‌లో పనిచేస్తున్న సిబ్బందికి ఇంకా విడుదల కాలేదని ఎంపీతో విన్నవించారు. ప్రస్తుతం జిల్లాలో 1,800 మందికి పైబడి సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి చెల్లించాల్సిన టీఏ, డీఏ, సరెండర్ లీవ్‌లకు సంబంధించిన బిల్లులు ప్రస్తుతం రూ.కోట్లల్లో పేరుకుపోయాయి. ఒక్కొక్కరికి కనీసం రూ. లక్ష నుంచి రూ.4 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉందని అసోసియేషన్‌ సభ్యులు చెబుతున్నారు. మంత్రులు ఉన్నచోట ప్రత్యేక చొరవ చూపి అలవెన్సులు మంజూరు చేయిస్తున్నారని, జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలెవరూ తమ గురించి పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.