అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె భర్త శ్రీశైలం కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లారు. కాగా.. నగరానికి చెందిన పాతిక మంది బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో రెండ్రోజుల కిందట మాజీ మేయర్ సమావేశం నిర్వహించారు. గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వీరిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఉన్నారు. పార్టీ మార్పు తథ్యం కావడం వల్లే మాజీ మేయర్ తో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా శుక్రవారం నియోజకవర్గానికి వచ్చినా.. ఆయన కార్యక్రమాల్లో మాజీ మేయర్ గానీ కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్న ఇతర నాయకులు గానీ హాజరు కాలేదు. అధికారంలో ఉన్న సమయంలో గణేష్ గుప్తా వెన్నంటే ఉన్న నాయకుల్లో సింహభాగం మంది దూరంగా ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా శనివారం చేపట్టిన కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. ఆఖరకు ఉద్యమ నాయకులు మాత్రమే మిగిలారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు ఉద్యమ నాయకులను పక్కనబెట్టి ఇతరులకు అందలం ఇచ్చారని.. అధికారం లేకున్నా తాము మాత్రం పార్టీలోనే కొనసాగుతామని ఉద్యమ నాయకులు అంటున్నారు.