కీర్తి సాయి ఆస్పత్రి ఘటనపై విచారణ..

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: నగరంలోని ఖలీల్వాడిలో గల కీర్తి సాయి నర్సింగ్ హోం ఘటనపై జిల్లా వైద్యారోగ్య శాఖ విచారణ చేపట్టింది. నాలుగు నెలల గర్భిణి గత ఆదివారం ఈ ఆస్పత్రిలో మృతి చెందింది. ఇందుకు ఆస్పత్రి వైద్యురాలు ప్రేమలత నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకులు ఆరోపించారు. అనంతరం మృతదేహంతో ఆస్పత్రిలో ఆందోళన చేపట్టారు. ఈ ఘటన బయటకు పొక్కకుండా.. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ప్రాణం ఖరీదు రూ.10 లక్షలు అంటూ.. అంతటా చర్చ జరిగింది. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రి వర్గాల్లోనూ ఈ వ్యవహారం చర్చకు దారితీసింది. అయినా.. ఐఎంఏ బాధ్యులు కనీసం స్పందించలేదు. చివరకు ఈ ఘటనపై జిల్లా వైద్యారోగ్య శాఖ విచారణ చేపట్టింది. అధికారుల విచారణలో రూ.10 లక్షల చెక్కు ఇచ్చినట్లు తేలిందని, ఇంకా పూర్తి విచారణ చేయాల్సి ఉందని వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. విచారణ అనంతరం డాక్టర్ ప్రేమలతపై చర్యలు ఉంటాయని ప్రకటనలో స్పష్టం చేశారు. ఆస్పత్రి యాజమాన్యం తమ తప్పేమీ లేదంటూనే.. రూ.10 లక్షల చెక్కు ఎందుకు ఇచ్చారన్నది ఇప్పుడు చర్చకు దారితీసింది. మరోవైపు వైద్యారోగ్య శాఖ మొక్కుబడిగా విచారణ చేపట్టిందనే ఆరోపణలు లేకపోలేదు. గతంలోనూ పలు ఆస్పత్రిలపై ఇదే తరహాలో ఆరోపణలు వచ్చినప్పటికీ.. విచారణ పేరిట రోజుల తరబడి కాలయాపన చేసి చేతులు దులుపుకున్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ స్పందించి ఆర్డీవో స్థాయి అధికారితో విచారణ చేయిస్తే నిజాలు నిగ్గుతేలనున్నాయి.