అక్షరటుడే, వెబ్ డెస్క్: అయిదేళ్లలో సిట్టింగ్ ఎంపీ అరవింద్ ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన నిజామాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎంపీ అరవింద్ చాలా ప్రభావవంతమైన లీడర్ అయినప్పటికీ.. ఇక్కడి ప్రజల కోసం ఏమీ చేయలేదన్నారు. అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ.. తన సొంత విలాసవంత జీవనానికి వాడుకున్నారని ఆరోపించారు. తాను ఎంపీగా గెలిస్తే అయిదు రోజుల్లో బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి, అయిదేళ్లలో కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. బోర్డు ఏర్పాటుపై ఆయనకే స్పష్టత లేదన్నారు. మరోమారు షుగర్ ఫ్యాక్టరీల పేరిట డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 2025 డిసెంబరులోగా షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించేలా తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు. ఆర్మూర్ – ఆదిలాబాద్ రైల్వే మార్గాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచామని, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు అందించామని చెప్పారు. ఇలాంటి ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదన్నారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ అమలు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో తాహెర్ బిన్, కేశ వేణు, నరాల రత్నాకర్, భక్తవత్సలం, జావిద్ అక్రం, నజీబ్ అలీ, రాజా నరేందర్, రామర్తి గోపి, వేణు రాజ్ తదితరులు పాల్గొన్నారు.