అక్షరటుడే, ఇందూరు: లోక్ సభ ఎన్నికల్లో డబ్బులు పంచింది కాంగ్రెస్ పార్టీయేనని.. ఆ పార్టీ నాయకులే ఆర్మూర్లో ఓటర్లకు డబ్బులు పంచుతూ పట్టుపడ్డారని ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చేసిన విమర్శలపై గురువారం ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మోదీ ప్రభావంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. డబ్బులు పంచానంటే ఎవరూ నమ్మరని.. ప్రజల ఆశీస్సులతోనే రెండోసారి ఎంపీగా గెలిచానన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వయసుకు గౌరవం ఇస్తానని.. కానీ వాళ్లు ఆ గౌరవాన్ని తీసుకోవట్లేదన్నారు. ముస్లిం ఓటు బ్యాంకు కరీంనగర్లో తక్కువగా ఉందనే కారణంతో జీవన్ రెడ్డి ఈసారి నిజామాబాద్ నుంచి పోటీ చేశారన్నారు. ఇక్కడి ప్రజల మీద ప్రేమతో పోటీ చేయలేదన్నారు. ఆయన కేవలం ముస్లిం ఓటు బ్యాంకు కోసమే బరిలో నిలిచారన్నారు. అయినప్పటికీ.. పార్లమెంట్ ప్రజలు ఎన్నికల్లో జీవన్ రెడ్డిని ఓడించి తగిన బుద్ధి చెప్పారని అరవింద్ పేర్కొన్నారు.