కాంగ్రెస్‌ నాయకులవి అబద్ధపు ప్రచారాలు

0

అక్షరటుడే, ఇందూరు: కాంగ్రెస్‌కు ప్రజల్లో ఆదరణ కరువైందని.. అందుకే ఆ పార్టీ నేతలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మండిపడ్డారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి అబద్ధాల లేఖలు రాసి పసుపు రైతులను మోసం చేస్తున్నారన్నారు. అవగాహన లేని వ్యక్తికి వ్యవసాయశాఖ అప్పజెప్పి కాంగ్రెస్‌ పెద్ద తప్పు చేసిందన్నారు. గత 60 ఏళ్లలో చేయని పనులను ప్రధాని మోదీ చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో పసుపు సాగు విస్తీర్ణం తగ్గలేదని, లేబర్‌ ఛార్జీలు సైతం ఎక్కువగానే ఉన్నాయని గుర్తు చేశారు. కానీ అవగాహన లేకుండా మంత్రి తుమ్మల కేంద్రానికి లేఖలు రాయడం విడ్డూరంగా ఉందన్నారు. చక్కెర కర్మాగారాలు పున:ప్రారంభిస్తామని చెప్పి, ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దేశ వ్యాప్తంగా మోదీ 53 కర్మాగారాలను తెరిపించారని వివరించారు. రాష్ట్రంలో మార్కెట్‌ యార్డుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, ఇలాంటి అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వం ఎకరాకు రూ.24 వేల సబ్సిడీ ఇస్తుందని గుర్తు చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేదన్నారు. వారి వల్ల కానిది తాము చేస్తున్నామని అందుకే కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.

24న చాగంటి ప్రవచనాలు

అర్వింద్‌ ధర్మపురి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 24న నగరంలోని పాత కలెక్టరేట్‌ మైదానంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర్‌రావు ప్రవచనాలు ఉంటాయని తెలిపారు. ప్రజలంతా హాజరుకావాలని కోరారు. సమావేశంలో అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు దినేష్‌ కులాచారి, గద్దె భుమన్న, నాగోల్ల లక్ష్మీనారాయణ, బంటు రాము, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.