అక్షరటుడే, ఇందూరు: ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు ‘అంతా ఓపెన్’ గానే అన్నట్లు సాగుతున్నాయి. ముఖ్యంగా ఆర్మూర్, నిజామాబాద్, బోధన్ డివిజన్లోని కేంద్రాల్లో విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి మరి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో విద్యార్థి వద్ద నుంచి రూ.500 నుంచి రూ.వెయ్యి వసూలు చేసినట్లు సమాచారం. అడిగేవారు లేకపోవడంతో ఓపెన్ స్కూల్ సొసైటీ అధికారులే బహిరంగంగా వసూళ్లకు తెరదీశారని విద్యార్థులు చెబుతున్నారు. ప్రతి మండలంలో ఒకటి నుంచి రెండు పాఠశాలల్లో సెంటర్లను ఏర్పాటు చేసి సమన్వయకర్తలను నియమించారు. అయితే ప్రస్తుతం పరీక్షలు కొనసాగడంతో ఆ సెంటర్లకు చెందిన పాఠశాల ఉపాధ్యాయులనే ఇన్విజిలేటర్లుగా విధులు వేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఉదాహరణకు వేల్పూర్ మండలంలో రెండు ఓపెన్ స్కూల్ సెంటర్లు ఉన్నాయి. ఈ పాఠశాలలకు చెందిన 12 మంది ఉపాధ్యాయులకు ఇన్విజిలేషన్ విధులు వేశారు. అలాగే భీంగల్ మండలంలో రెండు సెంటర్లకు 9 మంది, ఆర్మూర్లో నాలుగు సెంటర్లకు గాను 32 మందిని ఇన్విజిలేషన్ విధులు కేటాయించారు. ఇలా ఓపెన్ పది, ఇంటర్ పరీక్షల్లో అధికారులు, సిబ్బంది సహకారంతో జోరుగా చూచిరాతలు జరుగుతుండగా.. తెరవెనుక సెంటర్ల నిర్వాహకులు వేలల్లో వసూలు చేస్తున్నారు.