అక్షరటుడే, ఆర్మూర్: నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థి అరవింద్ కు సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉందని, ఆ పార్టీ నాయకులే ఆయన్ను ఓడగొడుతారని వ్యాఖ్యానించారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ తిరుమల గార్డెన్లో గురువారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి బాజిరెడ్డి హాజరై మాట్లాడారు. సోషల్ మీడియాలో మాట్లాడడం తప్ప.. ఎంపీగా అరవింద్ ప్రజల కోసం చేసింది శూన్యమన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని, రైతులు సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన నాయకులే నియోజకవర్గాల్లో అధికారం చలాయిస్తున్నారని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. ఆర్మూర్ ప్రాంత ఓటర్లు చైతన్యవంతులని, ఎలాంటి ప్రలోభాలకు లొంగరని పేర్కొన్నారు. ఈసారి బీఆర్ఎస్ కు అండగా నిలిచి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, విద్యాసాగర్ రావు, షకీల్ సతీమణి అయేషా ఫాతిమా, ఆర్మూర్ జడ్పీటీసీ సంతోష్, మాక్లూర్ ఎంపీపీ మస్తా ప్రభాకర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, నందిపేట మండల అధ్యక్షుడు సాగర్, నాయకులు పోల సుధాకర్, గంగాధర్, సుంకరి రవి, మోహన్ రెడ్డి, కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.