అక్షరటుడే, నిజామాబాద్‌: నగరంలోని పెద్దబజార్‌ యూనియన్‌ బ్యాంకు స్కాంలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడైన బ్యాంకు మేనేజర్‌ అజయ్‌ ఖాతాదారుల నుంచి కోట్ల రూపాయలు కొట్టేసి స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. కేసు విచారిస్తున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిజామాబాద్‌కు తరలించి విచారిస్తున్నారు. తమ పేరుపై తీసుకున్న రుణాలు రూ.3.10 కోట్లను తన ఖాతాలోకి మళ్లించుకున్నట్లు 23 మంది బాధితులు ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేనేజర్‌ను అరెస్టు చేసిన పోలీసులు నిజామాబాద్‌కు తరలించి విచారించగా.. ఖాతాదారుల డబ్బులను తన అకౌంట్‌కు మళ్లించుకుని స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. రూ.కోట్ల సొమ్మును అక్రమంగా తన ఖాతాకు తరలించి భారీగా ఇన్వెస్ట్ చేసినట్లు సమాచారం. దీంతో అతడి బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలపై విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే అజయ్ పేరిట ఆరుకు పైగా బ్యాంకు ఖాతాలున్నట్లు సమాచారం. ప్రధానంగా ఎలాంటి అర్హత లేకున్నా.. సిబిల్ స్కోర్ బాగలేకపోయినా ఇష్టారాజ్యంగా రుణాలు మంజూరు చేసినట్లు బ్యాంకు అధికారులు ఆడిట్ విచారణలో గుర్తించారు. బాధితుల వద్ద పోస్ట్ డేటెడ్ చెక్కులను తీసుకుని వాటి ద్వారానే నగదు మళ్లింపులు చేసినట్లు తెలిసింది. అయితే స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు సేఫ్ గా ఉన్నాయా? లేక నష్టపోయారా? అనేది త్వరలోనే స్పష్టత రానుంది.