రౌడీషీటర్ల కదలికలపై పోలీసుల నిఘా!

0

అక్షరటుడే, నిజామాబాద్‌ అర్బన్‌: కమిషనరేట్‌లోని రౌడీషీటర్ల కదలికపై పూర్తి నిఘా ఉంచినట్లు సీపీ కల్మేశ్వర్‌ తెలిపారు. ఎవరైనా నేరాలకు పాల్పడినా, బెదిరింపులకు గురిచేసినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కమిషనరేట్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో శనివారం రౌడీషీటర్ల మేళా నిర్వహించారు. ఈ సదర్భంగా సీపీ మాట్లాడుతూ.. కమిషనరేట్‌లో మొత్తం 326 మంది రౌడీషీటర్లు ఉన్నారని, వారి కదలికలపై స్థానిక స్టేషన్ల అధికారులు ఇకపై నిఘా ఉంచుతారని తెలిపారు. ఏయే సమయాల్లో ఎవరెవరిని కలిశారు? ఎందుకోసం కలుస్తున్నారు? తదితర విషయాలపై ఆరాతీసి చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై రౌడీషీటర్లు ఎక్కడైనా నేరాల్లో భాగస్వామ్యం అయినట్లు గుర్తిస్తే పీడీ యాక్టు ప్రయోగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఐపీఎస్‌ బి.చైతన్య రెడ్డి, నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ ఏసీపీలు రాజా వెంకట్‌ రెడ్డి, బస్వారెడ్డి, శ్రీనివాస్‌, ఎస్‌బీ సీఐ శ్రీశైలం, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.