ప్రకటన సరే..బోర్డు ఏర్పాటు ఏమైంది?

0

అక్షరటుడే, నిజామాబాద్‌ అర్బన్‌: పసుపు బోర్డు ఏర్పాటు కేవలం ప్రకటనకే పరిమితమైందని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో మరోమారు పసుపు రైతులను బీజేపీ మోసం చేస్తోందన్నారు. బుధవారం కాంగ్రెస్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేసి ఆరు నెలలు గడిచిందని, ఇప్పటివరకు ఎలాంటి కార్యకలాపాలు మొదలు కాలేదన్నారు. అధికారికంగా బోర్డు ఏర్పాటు కాలేదని గుర్తు చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో ఒకప్పుడు 85వేల ఎకరాల్లో పసుపు సాగయ్యేదని, ప్రస్తుతం కేవలం 35వేలకు తగ్గిందని చెప్పారు. సాగు విస్తీర్ణం తగ్గడంతోనే ధర పెరిగిందని, ఇందులో బీజేపీ గానీ ఎంపీ అర్వింద్‌ గానీ చేసిన కృషి ఏమీలేదని ఆయన పేర్కొన్నారు. రైతులను మోసం చేసేందుకే పసుపు ధరను ప్రకటిస్తున్నారని, బీజేపీ మాయమాటలను నమ్మవద్దని రైతులకు సూచించారు.