అక్షరటుడే, ఇందూరు: ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ప్రజా పాలన విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పది నెలల్లో ప్రజలకు అన్ని పథకాలు అందజేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కిందన్నారు. రాష్ట్రంలో పదేళ్లపాటు కొనసాగిన అప్రజాస్వామిక, కుటుంబ పాలనతో విసిగి వేసారిన ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ కు పట్టం కట్టారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48గంటల్లోనే ఆరు గ్యారంటీల్లో రెండు హామీలను అమలు చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ప్రజల ఆధారాభిమానాలతో అధికారంలోకి వచ్చామని, ప్రతి వాగ్ధానాన్ని తప్పకుండా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో సామాజిక, ఆర్థిక పరిస్థితుల విశ్లేషణ కోసం సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీలో ఇప్పటివరకు మహిళలకు 125.91 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద 21,890 మందికి 85 కోట్ల 78 లక్షల విలువ చేసే ఉచిత వైద్య సేవలు పొందారన్నారు. గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తున్న గృహాలకు రూ.75.81కోట్లు లబ్ధి చేకూరిందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా యువతి యువకుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటిఐ లను ఏటీసీ (అదినాతన సాంకేతిక కేంద్రాలు )లుగా తీర్చిదిద్దుతున్నమన్నారు. నిజామాబాద్, బోధన్, కమ్మరపల్లి లో తొలి విడత ఏటీసీ సెంటర్లను ప్రారంభించామన్నారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో కొనసాగిన కళా ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, అసిస్టెంట్ కలెక్టర్ సంకేత్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ రెడ్డి, ఆర్డిఓ రాజేంద్రకుమార్, మెప్మా పీడీ రాజేందర్, ఆయా శాఖల జిల్లా అధికారులు యువతీ యువకులు పాల్గొన్నారు.