అక్షరటుడే, నిజామాబాద్: ఇందూరు పసుపునకు మార్కెట్లో రికార్డు ధర పలుకుతోంది. వారం కిందట నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు ధర క్వింటాలుకు రికార్డు స్థాయిలో రూ.17,011 పలకడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామానికి చెందిన పోడోళ్ళ రాజు రైతుకు సాంగ్లీ మార్కెట్లో రూ.17,503 ధర పలకింది. శనివారం అదే గ్రామానికి చెందిన పాశపు మహేష్ రైతుకు సాంగ్లీ మార్కెట్లో రూ.18,900 ధర పలకడం విశేషం.
కేంద్రం నిర్ణయంతో..
పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీ ప్రకటన చేసిన అనంతరం పసుపు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అదేవిధంగా పసుపు సాగు విస్తీర్ణం కూడా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2018-19లో 6,46,947 ఎకరాలు సాగు కాగా, 2022-23 లో 8,04,259 ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. అదేవిధంగా 2018-19లో పసుపు ఎగుమతులు 1,33,600 టన్నులు కాగా, 2022-23 నాటికి ఇది 1,70,085 టన్నులకు చేరింది. ఒకవైపు కేంద్రం ఎగుమతులను ప్రోత్సహిస్తూనే, పసుపు దిగుమతులను క్రమక్రమంగా తగ్గించింది. 2018-19లో 30,578 టన్నుల పసుపు దిగుమతి చేసుకోగా, 2022-23 నాటికి దిగుమతులు కేవలం 16,769 టన్నులు మాత్రమే. ఈ కారణంగాపసుపు రైతులకు మంచి ధర లభిస్తోంది.
ఎంపీ అరవింద్ హర్షం
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి స్పందిస్తూ.. మునుపెన్నడూ లేనివిధంగా పసుపు ధరలు మార్కెట్లో ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. క్వింటాలు పసుపు ధర రూ.20వేలు కల్పించే విధంగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద కేంద్రం నిజామాబాద్ జిల్లాకు పసుపును ఎంపిక చేసి రాష్ట్రానికి పసుపు బోర్డు మంజూరు చేయడం వల్లే మంచి ధర లభిస్తోందన్నారు. గతంలో పనిచేసిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు పసుపు రైతులను నట్టేట ముంచాయని ఎంపీ పేర్కొన్నారు.