అక్షరటుడే, ఇందూరు: రాష్ట్రంలో బియ్యం టెండర్ల పేరిట భారీ స్కాం దాగి ఉందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా ఆర్ఆర్ ట్యాక్స్ మొదలైందని.. ప్రతీ పనిలో అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. సివిల్ సప్లై అధికారులు అవినీతిలో కూరుకుపోయార న్నారు. ఇందుకు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ వ్యవహారమే ఉదాహరణ అని గుర్తు చేశారు. ఇటీవల నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ తో పట్టణాభివృద్ధిపై చర్చించానన్నారు. నగరంలో డ్రైనేజీ, రోడ్లు అధ్వానంగా తయారయ్యారని, వాటిపై దృష్టి సారించాలని సూచించానని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ ను త్వరలోనే ప్రక్షాళన చేస్తానని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, లక్ష్మీనారాయణ ఇతర నాయకులు పాల్గొన్నారు.