అక్షరటుడే, ఇందూరు: నాగారం బొందం గడ్డ చెరువు కబ్జా వెనుక బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా అన్నారు. మంగళవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి సామాన్య ప్రజలను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్య స్థాపన అంటూ తెలంగాణను నిండా ముంచిందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఐదు డిక్లరేషన్లు అమలు చేయకుండా మోసం చేస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉంటే, ప్రస్తుతం మొదటి స్థానానికి చేరిందన్నారు. రుణమాఫీ ఒక మాయాజాలమని, ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ అని చెప్పి దశలవారీగా చేస్తున్నారన్నారు. అది కూడా పూర్తిస్థాయిలో చేయడం లేదని విమర్శించారు. ప్రతి సభలో దైవసాక్షిగా అంటూనే దగా చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు రాష్ర్టంలో అమలుచేయకుండా కొర్రీలు పెడుతుందన్నారు.