డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో అవినీతి

0

అక్షరటుడే, ఇందూరు: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో అవినీతి జరిగిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆరోపించారు. శనివారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి మొత్తం 2,030 ఇళ్లు మంజూరైతే, కేవలం 648 మాత్రమే పూర్తయ్యాయని.. లబ్ధిదారుల ఎంపిక జీవోకి వ్యతిరేకంగా జరిగిందన్నారు. జీవో ప్రకారం అర్బన్ లో ఎస్సీలకు 17%, ఎస్టీలకు 6%, మైనార్టీలకు12%, మిగతా వర్గాల వారిని సమానం చేస్తూ కేటాయింపులు జరగాలన్నారు. కానీ ఒక వర్గానికి 48 శాతం ఇళ్లను కేటాయించి మోసం చేశారన్నారు. ఇందులో కూడా బీఆర్ఎస్ నాయకులు, అనుచరులతో పాటు ఇదివరకు ఇల్లు ఉన్నవారికి కూడా కేటాయించారన్నారు. గత ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో కోట్ల రూపాయలు స్వాహా చేసిందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం రూ.162 కోట్లు, నీటి సరఫరాకు రూ.217 కోట్లు కేటాయించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి పి.లక్ష్మీనారాయణ, ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, కార్పొరేటర్ మాస్టర్ శంకర్, వీరేందర్, రాజు, రోషన్ తదితరులు పాల్గొన్నారు.