నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశంలో గందరగోళం

0

అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ నగరపాలక సంస్థ ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో గందరగోళం నెలకొంది. గురువారం ఉదయం మేయర్ నీతూ కిరణ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, కమిషనర్ మకరందు, అన్ని పార్టీల కార్పొరేటర్లు హాజరయ్యారు. అయితే సమావేశం ప్రారంభంలోనే గందరగోళం నెలకొంది. మీడియాకు అనుమతి లేదని చెప్పడంతో బీజేపీ కార్పొరేటర్లు మీడియాను అనుమతించాలని పట్టుబట్టారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ న్యాలం రాజుతో సహా పలువురు కార్పొరేటర్లు లేచి నిలబడి నిరసన తెలిపారు. గత ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధించిందని, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో వ్యవహరించడం సరికాదన్నారు. సమావేశంలో చర్చించే అంశాలు నగర ప్రజలకు తెలియాలంటే మీడియాను అనుమతించాలని పట్టుబట్టారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి మీడియాను బయటకు పంపారు. మరోవైపు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. కేవలం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రాక కోసం అరగంట ఆలస్యంగా ప్రారంభించారని బీజేపీ కార్పొరేటర్లు పేర్కొన్నారు.