పసుపు బోర్డు ఎక్కడ పెడతారు!

0

అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: ప్రధాని మోదీ పసుపు బోర్డు ప్రకటన చేసి ఆరునెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేస్తారా? లేదా అహ్మదాబాద్‌లో పెడతారా? అని ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాంషుగర్స్‌ను తెరిపిస్తామని ఎంపీ అర్వింద్‌ హామీ ఇస్తున్నారని.. ఆ పార్టీకి చెందిన ఎంపీయే గతంలో ప్రైవేటు భాగస్వామ్యంలో ఫ్యాక్టరీని నడిపించారని.. అప్పుడు ఎందుకు నడిపించలేకపోయారని ప్రశ్నించారు. అలాగే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఫ్యాక్టరీని ఎందుకు తెరిపించలేకపోయిందని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని తెరిపించేందుకు కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఉపాధిహామీకి వ్యవసాయ పనులను అనుసంధానిస్తామని పేర్కొన్నారు. నిజామాబాద్‌ను స్మార్ట్‌ సిటీగా గుర్తింపు పొందేందుకు ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. సమావేశంలో రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, కోఆపరేటివ్ లిమిటెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌, నగర అధ్యక్షుడు కేశవేణు, పీసీసీ ప్రధాన కార్యదర్శులు గడుగు గంగాధర్‌, నగేశ్‌రెడ్డి, నరాల రత్నాకర్‌, వేణురాజ్‌ అంతిరెడ్డి రాజారెడ్డి, అవేజ్‌ పాల్గొన్నారు.