అక్షరటుడే, జుక్కల్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. జలాశయంలోకి భారీగా వరద వస్తుండడంతో బుధవారం సాయంత్రం గేట్లను ఎత్తి మంజీరలోకి నీటిని విడుదల చేశారు. మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ బాలరాజ్ పూజలు గంగమ్మకు పూజలు చేశారు. అనంతరం ప్రాజెక్ట్ అధికారులు ఆరో నంబర్ వరద గేటు ఎత్తి నీటిని వదిలారు. ప్రస్తుతం డ్యాంలోకి ఎగువ నుంచి 24వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి 1405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1403.45 అడుగుల (15.9 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. అయితే నిజాంసాగర్‌కు ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టు గేట్లను సైతం బుధవారం రాత్రి ఎత్తే అవకాశం ఉండడంతో ప్రాజెక్టుకు మరింత ఇన్‌ఫ్లో పెరగనుంది. గురువారం వరద ఉధృతి పెరిగితే మరిన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదలనున్నారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ సీఈ శ్రీనివాస్, ఈఈ సోలోమాన్, ఎస్‌ఈ వాసంతి, ఏఈ శివప్రసాద్, సీనియర్ నాయకులు జయప్రదీప్, రవీందర్‌రెడ్డి, ప్రజాపండరి తదితరులు పాల్గొన్నారు.
సింగూరుకు 46వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
మెదక్ జిల్లాలోని సింగూరుకు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 46వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 523.600 మీటర్లు (29 టీఎంసీలు) కాగా 522.770 మీటర్ల (25.402 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. డ్యాంలోకి భారీగా ఇన్‌ఫ్లో వస్తుండడంతో రాత్రి గేట్లు ఎత్తి దిగువకు వదలనున్నారు. కాగా ఈ నీళ్లు గురువారం నిజాంసాగర్‌కు చేరుకునే అవకాశం ఉంది.