అక్షరటుడే, నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పదవి గండం ఏర్పడింది. డీసీసీబీకి చెందిన మొత్తం 20 మంది డైరెక్టర్లలో 15 మంది ఛైర్మన్ పైన అవిశ్వాస నోటీసు ఇచ్చారు. ముఖ్యంగా వైస్ ఛైర్మన్ రమేష్ రెడ్డి ఈ అవిశ్వాస ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గుత్తేదారు అయిన రమేష్ రెడ్డి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటికీ.. ప్రశాంత్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదే సమయంలో బోధన్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి సుదర్శన్ రెడ్డి గెలుపొందారు. సుదర్శన్ రెడ్డికి రమేష్ రెడ్డి సమీప బంధువు. దీంతో అవిశ్వాస ప్రక్రియ తెరపైకి వచ్చింది. మొత్తం 11 మంది మద్దతు కావాల్సి ఉండగా.. ఇప్పటికే 15 మంది సంతకాలతో నోటీసు ఇచ్చారు. వారంతా రమేష్ రెడ్డితో కలిసి క్యాంపులో ఉన్నారు.
రాజీనామా యోచన!
సొంత పార్టీ వారే భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస నోటీసు ఇవ్వడం ఊహించని పరిణామం. మెజారిటీ డైరెక్టర్ల నుంచి వ్యతిరేకత రావడానికి ఛైర్మన్ వ్యవహార శైలి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పలు విషయాల్లో డైరెక్టర్ల మాట లెక్క చేయకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం అవిశ్వాసం వరకు దారి తీసిందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ ప్రక్రియకు ముందే ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని భాస్కర్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసే అవకాశాలున్నాయి. బీబీ పాటిల్ బీజేపీలోకి వెళ్లడంతో ఆయనకు రూట్ క్లియర్ అయింది. కానీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు సొంత పార్టీ డైరెక్టర్ల నుంచి వ్యతిరేకత రావడం తీవ్ర చర్చకు దారి తీసింది.