Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం సంధ్య థియేటర్ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు థియేటర్ ఇష్యూను పెంచి పెద్ద చేస్తున్నాయి. తాజాగా ఇందులోకి విద్యార్థులు సైతం తలదూర్చారు. దీంతో ఈ చినికిచినికి గాలి వానలా మారుతోంది. కేసు కోర్టులో ఉండగా.. సినీ ప్రముఖులను అప్రతిష్టపాలు చేస్తూ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదరు ఇష్యూపై చర్చ లేవనెత్తడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదివారం అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ విద్యార్థుల దాడి చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.

అసలేం జరిగిందంటే..

పుష్ప-2 విడుదలకు ముందు రోజు సంధ్య థియేటర్లో ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. ఈ చిత్రాన్ని తిలకించేందుకు దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి కుటుంబ సభ్యులు థియేటర్ కు వచ్చారు. అక్కడికి భారీగా బన్నీ అభిమానులు అప్పటికే చేరుకున్నారు. అదే సమయంలో అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో సహా సినిమా చూసేందుకు థియేటర్ కు చేరుకున్నారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అస్వస్థతకు గురై మరణించారు. ఆమె కొడుకు సైతం తీవ్ర అస్వస్థత గురవడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అభిమానులను నియంత్రించలేక పోలీసులు అల్లు అర్జున్ ను ఇంటికి పంపించారు.

మరుసటి రోజు..

మరుసటి రోజు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు. అల్లు అర్జున్ అక్కడికి వస్తున్న విషయం ముందస్తుగా సమాచారం లేదని ప్రకటించారు. అటు అల్లు అర్జున్ గాని, ఇటు థియేటర్ వారు కానీ సమాచారం ఇవ్వలేదన్నారు. ఘటనపై కేసు నమోదు చేస్తున్నట్లు ప్రకటించారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ తలెత్తిన నేపథ్యంలో.. పోలీసులు నిబంధన ప్రకారం కేసు నమోదు చేసి అల్లు అర్జున్ అరెస్టు చేసి జైలుకు పంపించారు.

అసలు రాజకీయం ఇక్కడనే మొదలు..

అల్లు అర్జున్ ను అరెస్టు చేశాకే అసలు రాజకీయం మొదలైంది. ఇక్కడే బీఆర్ఎస్ నేతలు ఈ ఘటనలో ఎంట్రీ ఇచ్చారు. బన్నీ అరెస్టును దేశ సమస్యగా భావిస్తూ.. ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ లబ్ధి పొందే ప్రయత్నం చేయడంతో.. ప్రభుత్వం సంధ్య థియేటర్ ఘటనపై దృష్టి పెట్టింది. దీంతో పోలీసు శాఖ సమూలంగా వివరాలు సేకరించి ప్రభుత్వానికి సమర్పించింది.

అసెంబ్లీలో పొలిటికల్ చర్చ..

అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటనను ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్ఎస్ నేతలు చేసిన రచ్చకు.. అల్లు అర్జున్ ను బలి చేస్తూ ఘాటుగా విమర్శించారు. పోలీసులు వారి విధులు నిర్వర్తించాలని, దీనిని బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందన్న రేవంత్ రెడ్డి.. తాను సైతం అదే తోవలో వెళ్లారు. బీఆర్ఎస్ నేతలపై ఉన్న కోపాన్ని అల్లు అర్జున్ పై వెళ్లగక్కారు. బన్నీని ఘాటుగా విమర్శించారు. “ఒక మహిళ మృతి చెందిందని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పినా.. అల్లు అర్జున్ థియేటర్ నుంచి బయటకు వెళ్లలేదని” బన్నీ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడారు. అక్కడ మహిళ చనిపోయిన కూడా అల్లు అర్జున్ బయటకు వెళ్లేటప్పుడు రోడ్ షో చేశారని విమర్శించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  CM Revanth | కేంద్ర మంత్రిని కలిసిన రేవంత్​.. ఏమి కోరారంటే..

అల్లు అర్జున్ ఎమోషనల్ ప్రెస్ మీట్..

అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడిన తీరును అల్లు అర్జున్ తట్టుకోలేకపోయారు. అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు. సంధ్య థియేటర్ ఘటన తనను ఎంత కలవర పెట్టిందని, వేదనకు గురిచేసిందనేది వివరించారు.

అల్లు అర్జున్ ఇంటిపై దాడి

బన్నీ ప్రెస్ మీట్ పెట్టిన మరుసటి రోజే అతని ఇంటిపై దాడి జరిగింది. ఓయూ జేఏసీ నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ బన్నీ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. గాయపడిన బాలుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో కొందరు అల్లరి మూకలు అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు విసిరారు. పూల కుండీలు ధ్వంసం చేశారు. మొత్తానికి రచ్చరచ్చ చేశారు.

ఫార్ములా ఈ-కార్ రేస్ మరుగున పడేందుకేనా..

మాజీ మంత్రి కేటీఆర్ పై ఫార్ములా ఈ-కార్ రేసు కేసు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేసుపై దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ నేతలు అల్లు అర్జున్ అరెస్టును పెద్దగా చేస్తూ ఇష్యూ చేశారని ఆరోపణలున్నాయి.

సీఎం టెంప్ట్ కావడం సరైనదేనా..

బీఆర్ఎస్ నేతలు.. ప్రతిపక్ష హోదాలో ఏదైనా ఇష్యూ లేవనెడతారు. దానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి అంతగా టెంప్ట్ కావాల్సిన అవసరం లేదంటున్నారు రాజకీయ నిపుణులు. అసెంబ్లీ వేదికగా ఆయన మాట్లాడిన తీరును చూస్తుంటే.. ఇష్యూను వ్యక్తిగతంగా తీసుకున్నట్లు అనిపించిందని చెబుతున్నారు. కాస్త హుందాగా ప్రవర్తిస్తే బాగుండేదని పేర్కొంటున్నారు.

విద్యార్థుల సమస్యలే లేవా..

ఓయూ జేఏసీకి సంధ్యా థియేటర్ ఘటనకు అసలు సంబంధమే లేదు. అయినా సరే గాయపడిన బాలుడికి న్యాయం చేయాలనుకుంటే.. నేరుగా వెళ్లి అల్లు అర్జున్ తో మాట్లాడొచ్చు. కానీ అలా కాకుండా.. ఆందోళనకు దిగారు. ఇదే తరుణంలో దాడి ఘటన చోటుచేసుకుంది.

హుందాగా ప్రవర్తించిన బండి సంజయ్..

తొక్కిసలాటలో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను కేంద్రమంత్రి బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా హుందాగా ప్రవర్తించారు. సంధ్య థియేటర్ ఘటనపై రాజకీయం చేయవద్దని రిక్వెస్ట్ చేశారు. తమ ఇంటిపై దాడి విషయంలో అల్లు అర్జున్ కుటుంబీకులు హుందాగా ప్రవర్తించారనే చెప్పవచ్చు. మరి ఇకనైనా అధికారపక్ష ప్రతిపక్ష పార్టీలు ఈ ఘటనను ఇంతటితో ముగిస్తారా.. ఇంకా రచ్చ చేసి లబ్ది పొందాలని చూస్తారో వేచి చూడాల్సిందే.

Advertisement