అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్‌ నగరంలోని నిజాం కాలనీలో మొగల్‌ మేడోజ్ పేరిట ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్ విషయంలో అధికారులు మొక్కుబడి చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సంబంధిత యజమానులకు ఇటీవల నోటీసులు జారీ చేసిన నగరపాలక సంస్థ అధికారులు వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలని సూచించారు. కాగా.. మెమో జారీ చేసి పది రోజులు గడిచింది. ఎలాంటి అనుమతులు లేకపోగా.. వెంచర్ నిర్వాహకులు ఇప్పటివరకు స్పందించలేదు. ఆ తర్వాత చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చర్యలు మరిచారు. కాగా.. నుడా కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి వీరికి సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ వెంచర్లపై కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులే.. రియల్టర్లకు వెన్నంటి ఉండడంపై విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా సంబంధిత అక్రమ వెంచర్ విషయంలో చర్యలు తీసుకోవాలని, తదుపరి లావాదేవీలు జరుగకుండా రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాయాలని నగర ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే ఈ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా నగరపాలక సంస్థ కమిషనర్ ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.