అక్షరటుడే, వెబ్‌ డెస్క్‌: నిజామాబాద్‌ అర్బన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ బాదర్‌కు మెమో జారీ చేశారు. డాక్యుమెంట్ 4175/24 నంబర్‌ పేరిట అధికార కాంగ్రెస్‌కు చెందిన స్థలాన్ని అక్రమంగా ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్‌ సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని ‘అక్షరటుడే’ వెలుగులోకి తీసుకురాగా.. అనంతరం స్పందించిన రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ రమేశ్‌ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఇందులో భాగంగానే సబ్‌ రిజిస్ట్రార్‌ బాదర్‌కు బుధవారం మెమో ఇచ్చారు. రిజిస్ట్రేషన్‌ ఎందుకు చేయాల్సి వచ్చింది? అనే అంశంపై వివరణ కోరారు. మరోవైపు శాఖాపరమైన చర్యల నుంచి తప్పించుకునేందుకు సదరు దస్తావేజును రద్దు చేయించారు. అయితే రద్దు చేసిన డాక్యుమెంట్‌ సైతం నిబంధనల ప్రకారం లేదని, దీనివల్ల తమకు భవిష్యత్తులో న్యాయపరంగా చిక్కులు తప్పవని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. ఇదే విషయమై కాంగ్రెస్‌ నగరాధ్యక్షుడు కేశ వేణు డీఐజీ రమేశ్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయించాలని, లేనిపక్షంలో తామే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. కళ్లెదుటే తప్పిదం కనిపిస్తున్నా ఉన్నతాధికారులు మొక్కుబడి చర్యలతో మమ అనిపించేలా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.