అక్షరటుడే, ఎల్లారెడ్డి: బైక్‌ నడుపుతున్న ఓ మైనర్‌ రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. లింగంపేట మండలకేంద్రంలో సోమవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. ఎస్సై చైతన్యకుమార్‌ రెడ్డి కథనం ప్రకారం… సదాశివనగర్‌ మండలం ధర్మరావుపేటకు చెందిన చిన్నమ్మ ఆమె కుమార్తెతో లింగంపేటలోని బంధువుల ఇంటికి రాగా, కుమార్తెకు జ్వరం రావడంతో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించింది. పాల కోసం బయటకు వచ్చి తిరిగి ఆస్పత్రికి వెళ్తుండగా, రోడ్డు దాటే క్రమంలో వేగంగా వచ్చిన బైక్‌ ఢీకొంది. దీంతో ఆమె అక్కడే మృతిచెందగా, సమాచారమందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. కాగా, లింగంపేటలో యువత గంజాయి మత్తులో వాహనాలు నడుపుతున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. మైనర్లు వాహనాలు నడుపుతున్నా తనిఖీలు చేయట్లేదని ఆరోపిస్తున్నారు. తాజా ప్రమాద ఘటనే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొంటున్నారు.