అక్షరటుడే, బోధన్: అలీసాగర్ ఆయకట్టు పరిధిలో పంటలకు సాగునీరు అందించేందుకు వీలుగా శుక్రవారం ఎత్తిపోతల నీటిని విడుదల చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నవీపేట మండలం కోస్లీ వద్ద గల పంప్ హౌస్‌లో స్విచ్ఛ్ ఆన్ చేసి నీటి విడుదలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆయకట్టు రైతుల కోరిక మేరకు అలీసాగర్ లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేశామన్నారు. అయితే గోదావరిలో నీటి ప్రవాహం తక్కువగా ఉన్నందున, రైతులు పొదుపుగా నీటిని వినియోగించుకోవాలని సూచించారు. రైతాంగ ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నీటి పారుదల శాఖ ఎస్‌ఈ గంగాధర్, ఏఈ ప్రణయ్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, ఆయా శాఖల అధికారులు, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.