అక్షరటుడే, కామారెడ్డి : కామారెడ్డి-సిరిసిల్ల రోడ్డులో బైపాస్ పక్కన గల ఓ బంకులో శుక్రవారం పెట్రోల్ కు బదులు డీజిల్ పోసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి బంకులో ఇంధనం పోస్తుండగా గమనించి అది డీజిల్ గా గుర్తించాడు. ఇదేమిటని నిలదీయడంతో తప్పిదం జరిగిందని పెట్రోల్ ట్యాంక్ నుంచి డీజిల్ తీసేసి మళ్లీ పెట్రోల్ పోసి ఇచ్చారు. ఈ బంకులో తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెట్రోల్ కాదు డీజిల్ అని గమనించిన వారికి గంటల తరబడి బంకు వద్ద నిలబెట్టి మళ్లీ పెట్రోల్ పోసి ఇస్తున్నారు. ఈ విషయమై బంక్ మేనేజర్ ను ప్రశ్నించగా అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు జరగడం కామన్ అనే రీతిలో సమాధానం చెప్పడం వారి నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం. పెట్రోల్ బంకు వారు మోసానికి గురిచేస్తున్నా తూనికలు కొలతల అధికారులు మాత్రం బంకుల వైపు కన్నెత్తి చూడడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు.