అక్షరటుడే, ఇందూరు: విద్యాశాఖలో డిప్యుటేషన్ల పరంపర కొనసాగుతూనే ఉంది. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేకుంటే డిప్యుటేషన్లు వేయడం తప్పదు.. కానీ పుష్కలంగా ఉన్నా.. ఇతర పాఠశాలలకు వెళ్లడం వెనక మర్మమేంటో తెలియడం లేదు. ధర్పల్లి మండలం దుబ్బాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏకంగా ముగ్గురు స్కూల్ అసిస్టెంట్లకు డిప్యుటేషన్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఒకరిని ధర్పల్లికి, ఇద్దరిని డీబీ తండాకు పంపారు. నిజానికి దుబ్బాక నుంచి గతంలోనే ముగ్గురు డిప్యుటేషన్లపై వెళ్లగా ప్రస్తుతం మరో ముగ్గురు వెళ్లడంపై మండల ఉపాధ్యాయులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే డీబీ తండాలో ఇప్పటికే ముగ్గురు ఉపాధ్యాయులు మరో ముగ్గురు విద్యా వలంటీర్లు ఉన్నారు. అయినా ఒక మండల ఉపాధ్యాయ సంఘం నాయకులు కోరగానే డిప్యుటేషన్ వేయడం విస్మయం కలిగించింది. అలాగే డీబీ తండా ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా ఎస్జీటీ ఉన్నారు. ఆయన వద్ద స్కూల్ అసిస్టెంట్లు విధులు నిర్వహించడం మరో విశేషం. పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో డిప్యుటేషన్ ఇవ్వడం కొసమెరుపు. మొత్తం 8 మంది టీచర్లకు డిప్యుటేషన్ ఇచ్చారు.
