అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: యాసంగి ధాన్యం సేకరణ సజావుగా సాగేలా అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ సూచించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులు, సొసైటీ చైర్మన్లు, సీఈవోలు, ఐకేపీ సీసీలు, మెప్మా ప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వరి కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 462 కొనుగోలు కేంద్రాల ద్వారా 6 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించనున్నట్లు చెప్పారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులతో ప్రారంభోత్సవాలు చేయించకూడదని సూచించారు. కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ పారదర్శకంగా సాగాలని, రైతులను నష్టపరిచేలా వ్యవహరిస్తే సహించబోమని స్పష్టం చేశారు.