అక్షరటుడే, వెబ్‌డెస్క్ Glenn Maxwell : గత కొంత కాలంగా పాకిస్తాన్ జట్టు ఆట తీరు ఏమి బాగోలేదు. ఏ టోర్నీ అయిన పెద్దగా ప్రతిభ చూపడం లేదు. కెప్టెన్స్ మారిన, కోచ్‌లు మారిన వారి ఆటతీరులో మార్పు రావడం లేదు. అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాక్ చెత్త ప్రదర్శన కనబరిచింది. సెమీస్‌కి కూడా చేరుకోలేదు. అయితే సెమీస్‌కి వెళ్లిన ఆస్ట్రేలియా ఆటగాళ్లపై పాక్ మీడియా విమర్శలు కురిపించడం చర్చనీయాంశమైంది. భారత్ చేతిలో ఓడిపోవడంతో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది. భారత్ చేతిలో సెమీఫైనల్ లో ఓటమితో ఆస్ట్రేలియా ఖంగుతింది.
Glenn Maxwell : చెత్త వైఖరి..
ఇక ఆస్ట్రేలియా ఫైనల్‌కి చేరుకోని నేపథ్యంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే సెమీ-ఫైనల్స్‌లో ఓటమి బాధ ఆస్ట్రేలియా కంటే పాకిస్థాన్ మీడియాలోనే ఎక్కువగా కనిపించింది. భారత జట్టు ఆస్ట్రేలియాపై విజయం సాధించిన అనంతరం.. ఆసీస్ ఆటగాళ్లు కావాలనే బాగా ఆడలేదని పాకిస్థాన్ మీడియా చర్చ పెట్టడం మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెమీ-ఫైనల్ తర్వాత పాకిస్థాన్ టీవీ ఛానెల్ లో ఒక ప్యానలిస్ట్ ఓటమికి గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను నిందించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కాంట్రాక్టు పొందడానికి గ్లెన్ మ్యాక్స్‌వెల్ సెమీస్‌లో పేలవంగా ఆడాడని ఆ ప్యానలిస్ట్ మాట్లాడడం గమనార్హం.. “గ్లెన్ మ్యాక్స్‌వెల్ ను చూస్తుంటే అతను కోహ్లీ జట్టు తరపున ఆడుతున్నట్లు అనిపించింది తప్పా ఆస్ట్రేలియాకి ఆడుతున్నట్టుగా కనిపించలేదు. ఆస్ట్రేలియాను 300 పరుగులకు తీసుకెళ్లే అవకాశం మ్యాక్స్‌వెల్‌కి ఉన్నా అతను ఆ పని చేయలేదు. మరోవైపు విరాట్ కోహ్లీ ఇచ్చిన సులువైన క్యాచ్ జారవిడిచాడు. గతంలో ఆయన అలా ఆడడం ఎప్పుడు చూడలేదంటూ పాక్ టీవీ ఛానల్ లో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక సెమీస్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 264 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఛేదనకు దిగిన టీమిండియా 48.1 ఓవర్లలో 6 వికెట్లు మాత్రమే కోల్పోయి 267 పరుగులు చేసి గెలుపొందారు.