అక్షరటుడే, వెబ్‌డెస్క్: Patancheru | పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేతగాని వాళ్లే ఉన్నారని.. ఆ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన ఆరోపణలు గుప్పించారు. గతేడాది ఆయన సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కాగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇలా తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీసింది. పటాన్ చెరు ప్యారానగర్ డంప్‌యార్డ్ బాధితులు ఇటీవల ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లగా వారితో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.
Patancheru | సుప్రీంకోర్టులో కేసు ఉండడంతో..
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సుప్రీంకోర్టులో కేసు వేయడంతో విచారణ కొనసాగుతోంది. పార్టీ మారిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్, ఎన్నికల సంఘం, హైకోర్టులకు నోటీసులు కూడా జారీ చేసింది. వారిపై చర్యలు తీసుకోవడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో చెప్పాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీంతో పటాన్‌చెరు ఎమ్మెల్యే ప్లేటు ఫిరాయించినట్టు తెలుస్తోంది.
Patancheru | పార్టీ మారలేదని వ్యాఖ్యలు..
దీంతో తనపై చర్యలు తప్పవని తెలుసుకున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. తాను పార్టీ మారలేదని పలుమార్లు కార్యకర్తలతో పేర్కొన్నాడు. తన పార్టీ ఆఫీస్‌లో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పోస్టర్ ఉండడంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభ్యంతరం తెలుపగా.. వారితోనూ వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. తాజాగా కాంగ్రెస్ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కార్యకర్తలు అవాక్కయ్యారు. కాగా.. ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయినట్టు తెలుస్తోంది.