అక్షరటుడే, వెబ్‌డెస్క్: పీసీసీ అధ్యక్షుడిగా నేడు బాధ్యతలు చేపట్టనున్న బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ మొదట తన జీవితాన్ని కరాటే మాస్టర్‌గా ప్రారంభించారు. భీమ్‌గల్ మండలం రహత్‌నగర్‌లో పుట్టిన ఆయన నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాలపై ఉన్న ఆసక్తితో ఎన్‌ఎస్‌యూఐలో చేరారు. 1986లో నిజామాబాద్ జిల్లా ఎన్‌ఎస్‌యూఐగా అధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1994లో మొదటిసారి అప్పటి డిచ్‌పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం 2013-14 వరకు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. తదనంతరం పీసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2021 జూన్ నుంచి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. చివరగా 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలని భావించినా.. చివరకు షబ్బీర్‌అలీకి టికెట్ కట్టబెట్టడంతో పార్టీ కోసం పనిచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో 2024 జనవరి 29న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన గాంధీ భవన్ లో మధ్యాహ్నం 2:30 గంటలకు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.