అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: కబ్జాకు గురైన తెలంగాణ యూనివర్సిటీ భూములను రక్షించాలని పీడీఎస్ యూ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. వర్సిటీ ఏర్పాటు చేసిన సమయంలో 574 ఎకరాల భూములను అప్పటి ప్రభుత్వం కేటాయించిందన్నారు. అయితే 54 ఎకరాల భూమిని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తప్పుడు రికార్డులతో కాజేయాలని ప్రయత్నించారని వివరించారు. వ్యాపారులు కోర్టుకు వెళ్తే తెలంగాణ యూనివర్సిటీకి అనుకూలంగా తీర్పు వచ్చిందని గుర్తు చేశారు. భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కబ్జాదారుల నుంచి కాపాడి వర్సిటీకి అప్పగించాలని కోరారు. అలాగే చుట్టూ ప్రహరీగోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు తరుణ్, మహేశ్, సృజన్ తదితరులు పాల్గొన్నారు.