అక్షరటుడే, వెబ్‌డెస్క్ : కమిషనరేట్ పోలీసులు డీజేల విషయంలో కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. ఇకపై ఎక్కడైనా డీజేలు ఏర్పాటు చేస్తే నిర్వాహకులతో పాటు యజమానులపై కేసులు నమోదు చేయనున్నారు. ఈ విషయమై ఇప్పటికే సీపీ కల్మేశ్వర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డీజేల శబ్ధంతో ఇతరులకు ఇబ్బంది కలగడమే కాకుండా పలువురు నృత్యాలు చేస్తూ గుండెపోటుతో మృతి చెందిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన గణేశ్ నిమజ్జన ఉత్సవాల్లోనూ మాక్లూరుకు చెందిన ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో డీజేలు ఏర్పాటు చేయరాదని నిర్వాహకులకు సూచించారు. సబ్ డివిజన్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ర్యాలీలు, శోభాయాత్రలు, శుభాకార్యాలు ఇలా సందర్భం ఏదైనా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు.