అక్షరటుడే, వెబ్‌డెస్క్: ప్రస్తుతం అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలు ముగింపు దశకు వచ్చాయి. కానీ, కమిషనరేట్‌లో మాత్రం పోలీసు సిబ్బంది బదిలీలు జరగట్లేదు. హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ట్రాన్స్ ఫర్స్ కోసం ఏళ్లుగా ఎదురుచూపులు చూస్తున్నారు. కొందరు ఏడేళ్లకు పైగా ఒకే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. తమను బదిలీ చేయాలని వేడుకుంటున్నా.. ఉన్నతాధికారులు మాత్రం చర్యలు చేపట్టట్లేదు. వాస్తవానికి ఐదేళ్లు పూర్తయిన వారికి తప్పనిసరి బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ, పలు స్టేషన్లలో కొందరు ఏడేళ్లకు పైగా ఒకే చోట ఉండిపోయారు. ఉదాహరణకు 2016లో కొత్తగా పలు స్టేషన్లు ఏర్పడగా.. వాటిల్లో పనిచేస్తున్న వారంతా దాదాపు ఏడేళ్లు దాటినవారే ఉన్నారు. వీరంతా తమను బదిలీ చేయాలని గత రెండేళ్లుగా ఉన్నతాధికారులకు వినతులు అందిస్తున్నారు. మిగతా స్టేషన్లలోనూ పలువురు సిబ్బందికి ఐదేళ్లు దాటిపోయింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్కారు కసరత్తు చేస్తోంది. కోడ్ అమల్లోకి రాకముందే సాధారణ బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని పోలీసు సిబ్బంది కోరుకుంటున్నారు.