ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి

అక్షరటుడే, నిజామాబాద్‌: ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని డీఎంహెచ్‌వో సుదర్శనం సూచించారు. పల్స్‌ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీని డీఎంహెచ్‌వో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు ఈనెల 3న పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, పల్స్‌ పోలియో బూత్‌లు, రైల్వే స్టేషన్‌, బస్టాండ్ల వద్ద ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చుక్కల మందు వేస్తారని తెలిపారు. జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు 1,91,081 మంది ఉన్నారని, వీరి కోసం 1,007 బూత్‌ లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వీటితో పాటు మరో 37 ట్రాన్సిట్‌, 37 మొబైల్‌ బూత్‌లు నెలకొల్పామని వివరించారు. 2.40 లక్షల డోస్‌లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement