అక్షరటుడే, వెబ్‌డెస్క్: Posani Krishna Murali : సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కాస్త ఊరట లభించింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోసానికి కడప మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే పోసానిని కస్డడీకి ఇవ్వాలంటూ ఓబులవారిపల్లె పోలీసులు దాఖలు చేసిన పిటీషన్‌ను మొబైల్ కోర్టు డిస్మిస్ చేసింది. పోసాని కృష్ణ మురళిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల పోలీసులు పోసానికి పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు తొలుత పీటీ వారెంట్ జారీ చేశారు. రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని నరసరావుపేట కోర్టు ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో పోసానిని గుంటూరు సబ్ జైలుకు తరలించారు. అనంతరం కర్నూలు జిల్లా ఆదోని త్రీటౌన్ పోలీసులు గుంటూరు జైలులో రిమాండ్‌గా ఉన్న పోసానిని అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు కోర్టుకు తరలించగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో పోసానిని కర్నూలు జిల్లా కారాగారానికి తరలించారు. ఈ నెల 18 వరకు పోసాని అక్కడ రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు.
Posani Krishna Murali : పోసాని కస్డడీకి కోర్టు అనుమతి
మరోవైపు పోసాని కృష్ణ మురళిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు నరసరావుపేట కోర్డు అనుమతించింది. దీంతో పోసానిని శని, ఆదివారం పోలీసులు విచారించనున్నారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లను దూషించిన వ్యవహారంలో తనపై నమోదైన కేసులను కొట్టేయాలంటూ పోసాని ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగాల్సి ఉంది. కడప మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, పోసాని కృష్ణ మురళి నరసరావుపేట మరియు ఆదోని కోర్టుల నుండి బెయిల్ పొందవలసి ఉన్నందున ఆయన విడుదల కాలేకపోయారు. అవసరమైన అన్ని కేసుల్లో బెయిల్ ఆమోదాలు మంజూరు అయ్యే వరకు ఆయన కస్టడీలోనే ఉంటారు.