విదేశాల్లో చదవాలని ఆశపడుతున్నారా.. అయితే సోషల్‌ మీడియాను ఒళ్లు దగ్గరపెట్టుకుని వాడాల్సిందే!

0

అమెరికాకో.. ఇతర దేశాలకో.. చదువుకొనేందుకు వెళ్తున్నారా? అయితే సోషల్‌ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. విద్వేషపు పోస్టులు పెట్టినా, మరొకరిని ద్వేషించినట్టు తేలినా విదేశాల్లో చదివే అవకాశాన్ని కోల్పోయినట్టే.

Foriegn Education | హైదరాబాద్‌, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): అమెరికాకో.. ఇతర దేశాలకో.. చదువుకొనేందుకు వెళ్తున్నారా? అయితే సోషల్‌ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. విద్వేషపు పోస్టులు పెట్టినా, మరొకరిని ద్వేషించినట్టు తేలినా విదేశాల్లో చదివే అవకాశాన్ని కోల్పోయినట్టే. ఎన్నో ఆశలతో ఆ దేశాల ఎయిర్‌పోర్టుల్లో అడుగు పెట్టినా, ఈ కారణాలతో వెనక్కి తిరిగి రావాల్సిందే. విదేశాల్లో చదువుకోవాలనునే విద్యార్థులు సోషల్‌మీడియాలో పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలే 21 మంది భారతీయ విద్యార్థులు అమెరికా నుంచి వెనుదిగిన విషయం తెలిసిందే. వీరిలో కొందరి సెల్‌ఫోన్లను భద్రతాసిబ్బంది, ఇమ్మిగ్రేషన్‌ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. ఆయా ఫోన్లను పరిశీలించారు. వాట్సాప్‌ చాట్‌ను మాత్రమే పరిశీలించగా, పార్ట్‌టైమ్‌ జాబ్‌ల కోసం విద్యార్థులు వెతికినట్టు తేలింది. అదే తరహాలో యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియాను సైతం వెతికే అవకాశం ఉన్నట్టు కన్సల్టెన్సీల నిర్వాహకులు చెప్తున్నారు. ఆ సమయంలో విద్వేషం కలిగించే పోస్టులు దొరికినా, తిరస్కరించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటికే యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ అంచనా ప్రకారం 1.5 లక్షల హేట్‌స్పీట్‌ సైట్లను గుర్తించారు. వీటిని ట్యాగ్‌చేసినా.. కామెంట్లు పెట్టినా తిరస్కరించే అవకాశముందని స్పష్టం చేస్తున్నారు.