అక్షరటుడే, ఎల్లారెడ్డి: కొందరు సిబ్బంది నిర్లక్ష్యం.. నిరుపేదల పాలిట శాపంగా మారింది. ఉచిత విద్యుత్ పథకం వివరాల నమోదు ప్రక్రియ తప్పులతడకగా మారడంతో అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందడంలేదు. వివరాలను సరి చేయడానికి ఎడిట్ ఆప్షన్ కూడా లేకపోవడంతో అధికారులు సైతం ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో ఉన్నారు.
రేషన్ కార్డున్నా అందని ‘ఉచిత విద్యుత్’
లింగంపేట మండలం మెంగారంనకు చెందిన మార్గం సాయిలు ‘ప్రజాపాలన’లో ఉచిత విద్యుత్ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆధార్, రేషన్, విద్యుత్ మీటర్ నంబర్ వివరాలను అధికారులకు అందజేశాడు. రెండు రోజుల క్రితం విద్యుత్ సిబ్బంది వచ్చి రీడింగ్ తీయగా అతనికి ‘జీరో బిల్లు’ రాలేదు. రూ.600 బిల్లు రావడంతో ఆరా తీయగా అన్ని వివరాలు సరిగ్గా ఉన్నా.. విద్యుత్ కనెక్షన్ నంబర్ తప్పుగా నమోదు చేయడంతో జీరో బిల్ రాలేదని తెలుసుకుని మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లాడు. ఎడిట్ ఆప్షన్ లేదని, వచ్చేవరకు వేచి ఉండాలని అధికారులు చేతులు దులుపుకున్నారు.
‘రేషన్’ లేకున్నా జీరో బిల్
విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతో రేషన్ కార్డు లేకున్నా అదే గ్రామంలో మరో వ్యక్తికి జీరో బిల్లు వచ్చింది. సాయిలు రేషన్ కార్డు నంబర్‌ను సదరు వ్యక్తి విద్యుత్ కనెక్షన్ పైన తప్పుగా నమోదు చేయడంతో అతనికి జీరో బిల్లు వచ్చింది. ఇలా ఆయా గ్రామాల్లో తప్పులు దొర్లినా.. వాటిని సరిచేయడానికి ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
బాధితుడి ఫిర్యాదును స్వీకరించాం: మల్లికార్జున్ రెడ్డి, ఎంపీడీవో, లింగంపేట
మెంగారంనకు చెందిన సాయిలు రేషన్ కార్డుపై ఇతరుల విద్యుత్ కనెక్షన్ నమోదైంది. బాధితుడి ఫిర్యాదు స్వీకరించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అతడికి న్యాయం జరిగేలా చూస్తాం. లింగంపేటలో మరొకరికి కూడా ఈ సమస్య వచ్చింది. ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో వెంటనే సరి చేయడం వీలు కావట్లేదు.