PRC | పీఆర్సీ నివేదిక సిద్ధం..ఇప్పుడే వద్దంటున్న సర్కారు! ఎందుకో తెలుసా..?

పీఆర్సీ నివేదిక సిద్ధం..ఇప్పుడే వద్దంటున్న సర్కారు!
పీఆర్సీ నివేదిక సిద్ధం..ఇప్పుడే వద్దంటున్న సర్కారు!
Advertisement

అక్షరటుడే, హైదరాబాద్: PRC : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతన సవరణలకు చెందిన పీఆర్సీ నివేదిక సిద్ధమైనట్లు సమాచారం. కానీ, దానిని స్వీకరించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. ఈ విషయమై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. సర్కారు తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు.

PRC : సుదీర్ఘ కసరత్తు తర్వాత..

రాష్ట్రంలో మొదటి పీఆర్సీ గడువు 2023 జూన్‌ 30తో ముగిసింది. జులై 1, 2023 నుంచి రెండో పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. అయితే, అప్పటి కేసీఆర్‌ సర్కారు 2023 అక్టోబరులో వేతన సవరణ సంఘాన్ని నియమించింది. ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన పీఆర్సీ కమిటీ.. సుదీర్ఘ కసరత్తు తర్వాత కొన్ని నెలల క్రితమే పీఆర్సీ నివేదికను సిద్ధం చేసింది. నివేదికను సమర్పించేందుకు అధికారులు ప్రభుత్వ అనుమతి కోరినా, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నిరీక్షించాల్సి వస్తోంది.

PRC : సర్కారు జంకు..

పీఆర్సీ నివేదిక అంటేనే సర్కారు జంకుతోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నివేదికను తీసుకోకుండా కాలయాపన చేస్తూ పీఆర్సీ కమిటీపై నెపం నెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు యత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు.

PRC : తేనె తుట్టెను కదిలిస్తే..

హామీలు నెరవేర్చలేక, ఆదాయాన్ని సమీకరించుకోలేక ప్రస్తుత రేవంత్​ సర్కారు సతమతమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిట్‌మెంట్‌ ఆశాజనకంగా లేకపోతే ఉద్యోగవర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే తేనెతుట్టె పీఆర్సీని కదిలించడం ఎందుకులే అనే ధోరణిలో రేవంత్​ సర్కారు ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఇటీవల డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్కతో సమావేశమైనప్పుడు కూడా పెండింగ్‌ బిల్లులపై హామీ ఇవ్వడం తప్ప, పీఆర్సీ ప్రస్తావనే లేదని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Pawan Kalyan : వామ్మో.. ఇదెక్క‌డి అరాచ‌కం .. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫొటో చూపించే కోట్లు కాజేసిన కేటుగాళ్లు

PRC : మొదటి పీఆర్సీ ఇలా..

తెలంగాణ మొదటి పీఆర్సీ సీఆర్‌ బిశ్వాల్‌ కమిటీ నివేదికలో 7.5 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేయగా, కేసీఆర్‌ సర్కారు 30 శాతం ఫిట్‌మెంట్‌ను అందించింది. తద్వారా ప్రభుత్వంపై ఏడాదికి రూ.12,595 కోట్ల అదనపు భారం పడింది. 2015లో 43 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్‌ సర్కారు అంతకంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఇస్తే అసలుకే మోసం వస్తుందని ప్రభుత్వం జంకుతున్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

PRC : బకాయిల సంగతేంటి?

తెలంగాణ రెండో పీఆర్సీని జులై 1 నుంచి వర్తింపజేయాల్సి ఉంది. ప్రస్తుత పీఆర్సీలో పాత బకాయిల సంగతేంటి..? అని ఉద్యోగులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఒక పీఆర్సీకి మరో పీఆర్సీకి మధ్యకాలానికి గల వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు అప్పట్లో 5 శాతం మధ్యంతర భృతిని ప్రకటించింది. ప్రస్తుతం రేవంత్‌ సర్కారు బకాయిలను మానిటరీ బెనిఫిట్స్‌ రూపంలో ఇస్తుందా? నోషనల్‌ బెనిఫిట్స్‌ రూపంలోనా..? అన్న సందిగ్ధాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఐదు డీఏలు పెండింగ్‌లో పెట్టడం, పీఆర్సీలో జాప్యం, ఐఆర్‌ ఇవ్వకపోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Advertisement