Inter Exams : పసికందుగా ఉన్నప్పుడే అనారోగ్యంతో తల్లి తనువు చాలించింది. దాంతో అమ్మమ్మే ఆ పసికందు ఆలనా పాలనా చూసి పెంచి పెద్దచేసింది. అటువంటి అమ్మమ్మ చనిపోవడంతో ఆ బాలిక రోదన వర్ణనాతీతమైంది. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడులో సోమవారం జరిగింది.

లక్కరాజు గార్లపాడుకు చెందిన బిట్రా సీతమ్మ, శివన్నారాయణ దంపతులకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు వెంకట శివలక్ష్మిని మార్టూరు మండలం వలపర్లకు చెందిన పూర్ణచంద్రరావుకు ఇచ్చి పెండ్లి చేశారు. ఈ దంపతులకు కుమార్తె హేమలత, కుమారుడు శశికుమార్ ఉన్నారు. అయితే హేమలతకు ఐదు నెలల వయస్సు ఉన్నప్పుడు తల్లి వెంకట శివలక్ష్మి మరణించింది. దాంతో అమ్మమ్మ సీతమ్మ ఆ పాపను తన వద్దకు తెచ్చుకుని సాకింది. ఇప్పుడు హేమలత ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. రెండేళ్ల క్రితం హేమలత తండ్రి కూడా మరణించాడు.
కాగా సీతమ్మ సోమవారం బ్రెయిన్ స్ట్రోక్‌తో చనిపోయింది. పెంచి పెద్ద చేసిన అమ్మమ్మ ఇక లేదన్న బాధతో బాలిక బోరున విలపించింది. ఆ బాధను తిగమింగుతూనే మృతదేహం పక్కనే కూర్చుని పరీక్షకు సిద్ధమమైంది. ఆ బాధను భరిస్తూనే ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు హాజరైంది. తల్లి, తండ్రి, అమ్మమ్మను కోల్పోవడం ఉన్న తాత మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో బాలిక భవిష్యత్‌పై అంతా బాధపడుతున్నారు. దాతలు సహకరించి సాయం చేయాల్సిందిగా స్థానికులు కోరారు.