అక్షరటుడే, వెబ్‌డెస్క్ : దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు.. కేసుల సత్వర పరిష్కారానికి జాతీయ స్థాయిలో నెట్‌వర్క్ ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. నల్సార్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మహిళా న్యాయవాదులు, న్యాయ విద్యార్థులతో ఒక నెట్‌వర్క్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ 21 స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో సంపన్నులకు లభించే న్యాయం.. నిరుపేదలకు లభించడంలేదన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని.. ఈ మార్పుకు న్యాయ నిపుణులు మార్గదర్శకులుగా నిలవాలని కోరారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బంగారు పతకాలు అందజేశారు. వర్సిటీలో జంతు న్యాయ కేంద్రం ఏర్పాటుపై రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే హాజరయ్యారు.