కేవీ కొత్త భవనంతో విద్యార్థుల సంఖ్య రెట్టింపు

0

అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్‌ నగరంలోని కేంద్రీయ విద్యాలయానికి కొత్త భవనాన్ని ప్రారంభించుకోవడంతో విద్యార్థుల సంఖ్య రెట్టింపు అవుతుందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. నగరంలో నిర్మాణం పూర్తి చేసుకున్న కేవీ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జమ్మూ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రస్తుతం నిజామాబాద్‌లోని విద్యాలయంలో 441 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి తరగతికి రెండు సెక్షన్లు ప్రారంభించుకోవచ్చని, దీంతో మరికొందరు విద్యార్థులకు అవకాశం లభిస్తుందన్నారు. ఇప్పటివరకు కేవలం పదో తరగతి వరకే ఉందని భవిష్యత్తులో 11, 12వ తరగతులు కూడా ప్రారంభమవుతాయన్నారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా కేంద్రీయ విద్యాలయాలు నిర్మించడం కేవలం బీజేపీకే సాధ్యమన్నారు. వచ్చే సంవత్సరం బోధన్‌లో కూడా సొంత భవనం పూర్తవుతుందని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. ఎంపీ చొరవతో విద్యాలయానికి సొంతభవనం వచ్చిందన్నారు. తన సొంత నిధులతో పాఠశాల ప్రాంగణంలో సరస్వతీ విగ్రహం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. విద్యాలయ ఛైర్మన్‌, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. విద్యార్థులకు మార్కులతో పాటు మానసిక దృఢత్వం అవసరమన్నారు. అంతకుముందు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ రెజి వీఆర్‌ నాథ్‌, ప్రిన్సిపల్‌ వెంకటేశ్వరరావు, స్థానిక కార్పొరేటర్‌ మమత, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.