అక్షరటుడే, వెబ్ డెస్క్: సార్వత్రిక ఎన్నికల వేళ కచ్చతీవు కిస్సా తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. 1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాక్ జల సంధిలో ఉన్న కచ్చతీవు ద్వీపాన్ని నిర్దాక్షణ్యంగా శ్రీలంకకు ధారాదత్తం చేసిందనే కథనాన్ని ఉటంకిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ట్వీట్ చేశారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై చేసిన స.హ. చట్టం దరఖాస్తు నేపథ్యంలో కచ్చతీవు చర్చ తెరపైకి వచ్చింది. వ్యూహాత్మకంగా కీలకమైన కచ్చతీవు ద్వీపాన్ని పరులపాలు చేయడం ద్వారా దేశ సమగ్రత, ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించడం రాజకీయంగా చర్చకు దారితీసింది.

దీవి ప్రత్యేకత ఏమిటంటే..
తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో భారత్-శ్రీలంకకు మధ్య ఉన్న చిన్న ద్వీపమే ఈ కచ్చతీవు. పాక్ జల సంధిలో ఉన్న చిన్న ద్వీపం రామేశ్వరానికి 19 కిలోమీటర్లు, శ్రీలంకలోని జాహ్నకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని విస్తీర్ణం 285 ఎకరాలు. ఇక్కడ ఉన్న సెయింట్ ఆంథోని చర్చిలో ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి.
ఎక్స్ వేదికగా ప్రధాని వ్యాఖ్యలు
కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించాలన్న 1974 ఇందిరా గాంధీ సర్కారు నిర్ణయంపై భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై స.హ. చట్టం ద్వారా సమాచారం కోరారు. దీని ఆధారంగా ప్రచురితమైన కథనాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. కచ్చతీవు ద్వీపం విషయంలో కాంగ్రెస్ నిర్ణయాన్ని ప్రధాని మోదీ తప్పుబట్టారు. ఆ పార్టీ పూర్తి నిర్లక్ష్యంగా ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చేసిందని ఆయన ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. దేశానికి కనువిప్పు కలిగించే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా కచ్చతీవును వదిలేసిందని, ఇది ప్రతి భారతీయుడి ఆగ్రహానికి కారణం అయిందని పేర్కొన్నారు. దేశ సమగ్రత, ఐక్యతను బలహీనపరిచేలా 75 ఏళ్లు కాంగ్రెస్ పాలించిందని పేర్కొంటూ ప్రధాని మోదీ కథనాన్ని ఉటంకించారు.
రాజకీయ సమస్య..
తమిళనాడులో బీజేపీ పట్టు పెంచుకోవాలని తీవ్ర యత్నాలు చేస్తున్న సమయంలో కచ్చ తీవు ద్వీపాన్ని ఆ పార్టీ ప్రధాన ఆయుధంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. భారత జలాల్లో మత్స్య సంపద తగ్గిపోవడంతో తమిళనాడులోని రామేశ్వరంతో పాటు పరిసర ప్రాంతాల మత్స్యకారులు ద్వీపానికి వెళ్తుంటారు. ఇందుకోసం వారు అంతర్జాతీయ మారిటం సరిహద్దు దాటి శ్రీలంక నేవికి చిక్కి కటకటాల పాలవుతుంటారు. అంటే భారత ప్రాదేశిక జలాలను దాటి వెళుతున్న తరుణంలో తమిళనాడు జాలర్లను శ్రీలంక నేవి పట్టుకొని జైళ్లలో ఉంచుతోంది. ఈ నేపథ్యంలో ఇది రాజకీయ సమస్యగా మారింది.
ఆనాడే కరుణానిధికి సమాచారం
అసలు కచ్చతీవు ద్వీపం ఎవరి అధీనంలో ఉందని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై స.హ. చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. 1974లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ జల సంధిలోని కచ్చ తీవు దీవిని శ్రీలంకకు కట్టబెట్టిందని కేంద్రం సమాచారం ఇచ్చింది. కేంద్ర నిర్ణయాన్ని అప్పటి విదేశాంగ శాఖ కార్యదర్శి కేవా సింగ్.. నాటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి కూడా తెలియజేసినట్లు కేంద్రం వివరణ ఇచ్చింది. కచ్చతీవు ద్వీపం తమదేనని నిరూపించుకోవడంలో అప్పటి శ్రీలంక ప్రభుత్వం వైఫల్యం చెందిందని తమిళనాడు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కేవా సింగ్ పేర్కొన్నారు. జమీందారీ వ్యవస్థ రద్దుతో.. కచ్చతీవు దాని పరిసరాల్లోని మత్స్య సంపదపై రాంనాడు రాజుకు జమీందారీ హక్కులను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చింది. అలా 1948 నుంచి 1975వరకు ఈ దీవిపై రాంనాడు రాజులు జమీందారీ హక్కులను కలిగి ఉన్నారు. జమీందారీ వ్యవస్థ రద్దు తర్వాత మద్రాస్ రాష్ట్రానికి అప్పగించారు.
చారిత్రాత్మక ప్రదేశం..
1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిందని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఇటీవల పేర్కొన్నారు. కచ్చ తీవు ద్వీపం దేశానికి ఎంత ముఖ్యమైన భూభాగమో.. తమిళనాడు ప్రజలకే కాకుండా దేశ పౌరులందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. తమిళనాడుకు కచ్చతీవు చారిత్రాత్మక ప్రదేశమని అన్నామలై తెలిపారు. వేల ఏళ్లుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా తమిళనాడు మత్స్యకారులు దీవి పరిసర ప్రాంతాల్లో చేపలు పట్టేవారని.. అటువంటి ప్రాంతాన్ని శ్రీలంకకు ఏ ప్రాతిపదికన ధారాదత్తం చేశారని ప్రశ్నించారు. ఇరుదేశాల ఒప్పందానికి సంబంధించిన సమాచార వివరాలు ఇవ్వాలని తాను విదేశాంగ శాఖను కోరినట్లు అన్నామలై చెప్పారు.