ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

0

అక్షరటుడే, నిజామాబాద్: రాష్ట్రంలోని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ తెలంగాణ కృషి చేస్తుందని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించేలా తమ సంఘం చొరవ చూపుతుందని తెలిపారు. నిజామాబాద్ శాఖ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హర్ష వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. 317 జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు త్వరలోనే శుభవార్త చెప్పేలా తమ సంఘం ప్రభుత్వంతో మాట్లాడుతుందని చెప్పారు. అలాగే బదిలీ అయ్యి రిలీవ్ కాని ఉపాధ్యులందరు కూడా ఏప్రిల్ లోగా తమ స్థానాలకు వెళ్లేలా ఉత్తర్వులు ఇప్పించే బాధ్యత తమ సంఘం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న వారికి కనీస వేతనాలు అమలు చేయిస్తామని హామీ ఇచ్చారు. పండిత్, పీఈటీలకు కూడా న్యాయం చేస్తామన్నారు. జిల్లాలో సంఘం బలోపేతానికి కృషి చేస్తున్న కృపాల్ సింగ్ ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉమాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పార్వతి సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కనకపురం రవీందర్, సంఘం నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు