అక్షరటుడే, వెబ్ డెస్క్: రక్షాబంధన్.. సోదరసోదరీమణుల అనుబంధానికి ప్రతీక. తోబుట్టువు పదికాలల పాటు చల్లగా ఉండాలని సోదరి కట్టేదే రాఖీ. అలాగే జీవితాంతం తన సోదరికి రక్షగా ఉంటానని సోదరుడు ఇచ్చే భరోసా ఈ పండుగ ప్రత్యేకత. రాఖీ పండగ అంటే అన్నదమ్ముళ్లు, అక్కాచెలెళ్ల ప్రేమానురాగాలను గుర్తుచేస్తుంది.
దేశంలో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే సోదరభావం కేవలం తోబుట్టువుల మధ్యే కాదు.. భారతీయురాళ్లందరిలోనూ పెంపొందాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచార ఘటనతో ప్రస్తుతం యావత్ భారతావని దిగ్భ్రాంతికి గురవుతోంది. మన తెలంగాణ రాష్ట్రంలోనూ ‘దిశ’ లాంటి ఘటనలు కోకొల్లలు. ఇలాంటివి పునరావృతం కావొద్దంటే.. ప్రతి ఒక్కరూ బడిలో చేసే “భారతదేశం నా మాతృ భూమి.. భారతీయులంతా నా సహోదరులు” ప్రతిజ్ఞ గుర్తు చేసుకొని ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి మహిళ, యువతిని సోదరిగా భావించడమే కాకుండా.. తన చుట్టుపక్కల ఎవరికైనా చిన్న ఆపద వచ్చినా అండగా నిలబడిన నాడే దేశంలో మార్పు సాధ్యమవుతుంది. ఈ రాఖీ పండగ నుంచే దేశంలోని సోదరీమణులకు రక్షణగా నిలుద్దామనే ప్రతినబూనుదాం..
రాముడు నడయాడిన నేలపై..
రాముడు నడయాడిన ఈ నేలపై ఆయన సోదరి శాంతాదేవి నిర్భయంగా తిరిగిందంటారు. మృత్యు దేవుడి సోదరి యముని స్వేచ్ఛగా సంచరించిన దేశం ఇది. దుశ్శాసనుడి నుంచి ద్రౌపదిని రక్షించిన శ్రీకృష్ణుడి అంశ మనది. అలాంటి పుణ్యభూమిలో నేడు అవని తల్లి చెరపబడుతోంది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ బాధ్యురాలికి అండగా నిలవాల్సిన వారే స్నేహితులు, బంధువులు, చివరికి కన్నతండ్రి రూపంలోనూ మాన ప్రాణాలు దోచేస్తున్నారు. వీరికి తోడు బయట రాబందులు, తోడేళ్లు దారి కాచుకుని దాడి చేసి, దహించేస్తున్న పరిస్థితి కొనసాగడం స్త్రీ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేస్తోంది.
ఎందుకీ క్రూరత్వం..
చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలకు జీవిత విలువలు నేర్పకపోవడం సమాజంలో నేటి పరిస్థితులకు కారణం అవుతున్నాయి. అతిగారాబం, ఎంత అల్లరి చేసినా పట్టించుకోకపోవడం, చెడు తిరుగుళ్లను నియంత్రించకపోవడం, జీవితంలో ఏది మంచి.. ఏది చెడు అనేది నేర్పకపోవడంతో యువత బాధ్యత లేకుండా.. బలాదూరు తిరుగుళ్లు తిరుగుతూ.. సమాజానికే చీడపురుగుల్లా మారుతున్నారు. ఇలాంటి కీచకులు ఏ రూపంలో తమ వెంట ఉన్నారో తెలియక స్త్రీమూర్తులు, అమ్మాయిలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చిగురుటాకుల్లా భయంతో వణికిపోతూ కాలం వెల్లదీస్తున్నారు.
శ్రీకృష్ణుడికి ద్రౌపది కట్టిన రాఖీ
శ్రీకృష్ణుడు అనగానే అందరికీ 16 వేల గోపికల ముద్దుల ప్రియుడు గానే అందరికీ తెలుసు. కృష్ణుడి వేలికి గాయమైతే.. ద్రౌపది తన చీర కొంగును చించి కట్టు కడుతుంది. ఈ సందర్భంలో ఆ సోదరి ప్రేమకు అబ్బురపడిన శ్రీకృష్ణుడు ఆపత్కాలంలో అండగా ఉంటానని ఆమెకు అభయమిస్తాడు. ఇచ్చిన మాట ప్రకారం ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో చీరనిచ్చి రక్షిస్తాడు. నేటి సమాజంలో ఎందరో ద్రౌపదులను దుశ్శాసునులు చెర పడుతున్నారు. రాఖీ కడితేనే సోదరి అని కాకుండా.. ప్రతి ఒక్క యువకుడు మహిళల్లో తమ సోదరిని చూస్తూ ఆ శ్రీకృష్ణుడిలా రక్షించేందుకు ప్రతినబూని అండగా నిలవాలి.
రాణి కర్ణావతి.. చక్రవర్తి హుమాయూన్
మేవార్ కు చెందిన రాణి కర్ణావతి గుజరాత్ బహదూర్ షా దాడికి వ్యతిరేకంగా సహాయం కోరుతూ హుమాయూన్ చక్రవర్తికి రాఖీని పంపింది. ఆమె విన్నపం విన్న హుమాయూన్ రక్షించేందుకు వెళ్తాడు. ఆపదలో ఉన్న మహిళలను గుర్తించి రక్షించడం ప్రతి ఒక్క యువకుడి బాధ్యతగా గుర్తుతెరగాలి.
రవీంద్రనాథ్ ఠాగూర్ చొరవ
20వ శతాబ్దం ప్రారంభంలో, రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశంలోని అన్ని వర్గాల మధ్య ఐక్యత, సోదరభావానికి చిహ్నంగా రక్షాబంధన్ భావనను ప్రారంభించారు. రాఖీ కట్టడం అనేది జీవసంబంధమైన తోబుట్టువులు, విభిన్న నేపథ్యాల వ్యక్తుల మధ్య రక్షణ బంధానికి ప్రతీక అని ఆయన నమ్మారు. నేటి యువత రవీంద్రనాథ్ ఠాగూర్ ను ఆదర్శంగా తీసుకోవాలి.
మరో సోదర ఉద్యమం తీసుకొద్దామా..
1905 బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ ను మత ప్రాతిపదికన విభజించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో స్వదేశీ ఉద్యమం మొదలైంది. హిందువులు, ముస్లింలు ఐక్యతను చాటుతూ ఒకరికొకరు మణికట్టుకు రాఖీలు కట్టుకున్నారు. కామాంధుల అకృత్యాలకు బలైపోతున్న అబలను చూసి నిలువెల్లా వణికిపోతున్న అతివలకు అభయం ఇచ్చేందుకు స్వదేశీ ఉద్యమంలా మరో సోదర ఉద్యమం కొనసాగించాలి.
ఇస్తారా అభయం..
రక్షాబంధన్ రోజున అన్నాచెల్లెలు, అక్కాతమ్ముళ్లు ఎంతో సంబరంగా పండగ నిర్వహించుకుంటారు. మరి ఈ వేడుకలు కేవలం తోబుట్టువుల మధ్యేనా..? ఇంట్లో సోదరితో రాఖీ కట్టించుకుని బయటకు వచ్చాక.. పట్టు పరికిణిలో వెళ్తున్న పక్కింటి యువతిని కామంతో చూసే వారెందరో మన మధ్య ఉంటారు. మరి ఇలాంటి వారిని గుర్తించలేమా.. సాటి మహిళలను వీరి నుంచి రక్షించలేమా.. అంటే గుర్తించగలం, రక్షించగలం. కానీ పట్టింపు లేనితనం. మన దాకా వచ్చే వరకు పరిస్థితిని అంచనా వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం. రక్షాబంధన్ రోజున సోదరితో రాఖీ కట్టించుకునే మనం.. సమాజంలోని మహిళలందరిలో ఆ సోదరిని చూసిన నాడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిలువరించవచ్చు.