అక్షరటుడే, ఇందూరు: రుద్రూర్‌ వ్యవసాయ పాలిటెక్నిక్ ఫస్టియర్ విద్యార్థిని రక్షిత మృతిపై సమగ్ర విచారణ జరపాలని ఆమె తండ్రి విష్ణు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కోరారు. ఈ మేరకు శుక్రవారం పీడీఎస్‌యూ, యూఎస్‌ఎఫ్‌ఐ, పీవైఎల్, ధర్మసమాజ్‌ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కళాశాలలో చేరిన మూడు రోజులకే తమ కూతురు చనిపోయిందని కళాశాల ప్రిన్సిపాల్‌ చెప్పారని.. కనీసం తాము కళాశాలకు చేరుకోకుండానే మృతదేహాన్ని తరలించాలని వాపోయారు. తమ కూతురి మృతిపై అనుమానాలున్నాయని, సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది సూరి, ధర్మసమాజ్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహిపాల్‌ మహారాజ్, విద్యార్ధి సంఘాల నాయకులు కార్తీక్, ప్రిన్స్, మహేశ్, దేవిక, ప్రేమ్, మహేశ్ పాల్గొన్నారు.