Vijayashanthi | రాములమ్మను కేబినెట్​లోకి తీసుకోనున్నారా.. హాట్​టాపిక్​గా మారిన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం..!

Advertisement

అక్షరటుడే, హైదరాబాద్: Vijayashanthi : కాంగ్రెస్​ నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ టికెట్​ దక్కించుకున్న సినీ నటి విజయశాంతి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్​ టాపిక్​గా మారారు. ఆమెకు పార్టీ అధిష్ఠానం మంత్రి పదవి ఇస్తే బాగుంటుందన్న ప్రచారాన్ని కొన్ని మీడియా సంస్థలు తెగ వైరల్​ చేస్తున్నాయి. అయితే సీనియర్లను కాదని, నిన్నామొన్న పార్టీలోకి వచ్చిన రాములమ్మకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడమే గొప్ప అని పార్టీలోని కొందరు గొణుక్కొంటున్నారు.

Vijayashanthi : ఆ స్థాయి వ్యక్తే…

సినిమాల్లో లేడీ అమితాబ్​గా గుర్తింపు పొందిన విజయశాంతి ఒకప్పుడు బలమైన నాయకురాలే. రాజకీయాల్లో సుదీర్ఘ కాలం నుంచి ఉంటున్నారు. బహిరంగ సభల్లో తన మాటలను తూటాలుగా పేల్చేవారు. తెలంగాణ సాధన కోసం పార్టీని స్థాపించి ఉద్యమించారు. పార్లమెంటు వేదికగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను దేశ వ్యాప్తంగా చాటారు. ప్రస్తుతం కాంగ్రెస్​లో ఫామ్​లో ఉన్నవారితో పోల్చితే.. విజయశాంతి ఎంతో సీనియర్​ అని చెప్పకతప్పదు. మంత్రి పదవికి ఆమె అన్ని విధాలుగా అర్హురాలనే చెప్పొచ్చు.

Vijayashanthi : ప్రస్తుతం ఇద్దరు..

రాష్ట్ర మంత్రి వర్గంలో ప్రస్తుతం ఇద్దరు మహిళలు ఉన్నారు. దేవాదాయశాఖ మంత్రిగా కొండా సురేఖ.. పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సీతక్క బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విజయశాంతిని కూడా మంత్రి వర్గంలోకి తీసుకుంటే మహిళా మంత్రుల సంఖ్య ముగ్గురికి చేరుకుంటుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముగ్గురు మహిళా మంత్రులు ఉన్న సందర్భం ఇంత వరకు ఏర్పడలేదు. విజయశాంతికి మంత్రి పదవి ఇస్తే మాత్రం ఆ ఘనత రేవంత్​రెడ్డి సర్కారుకే దక్కుతుంది.

Vijayashanthi : ఆమె క్రేజ్​ వేరు..

విజయశాంతి అంటే ఒకప్పుడు జనాల్లో ఆ క్రేజ్​ వారు. రాములమ్మగా అందరి హృదయాల్లో నిలిచారు. మాట తీరు కూడా హుందాగా ఉండేది. తెలంగాణ ఉద్యమం సమయంలో చిరంజీవిని కూడా గట్టిగా విమర్శిస్తూ మాట్లాడారు. ఎంపీగా పార్లమెంటులో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గళాన్ని సైతం ఎలాంటి తడబాటు లేకుండా వినిపించారు. ఆ మధ్య ఓ సినీ ఈవెంట్​లో వేదికపైనే చిరంజీవిని ఒక ఆట ఆడుకున్నారు.

Vijayashanthi : ఇప్పుడు మాటల్లో తడబాటు..!

సుదీర్ఘ విరామం తర్వాత రాజకీయాల్లో కనబడటంతో ఆమెపై జనాల్లో ఉన్న క్రేజీ తగ్గినట్లు చెబుతున్నారు. ఆమెలో నాయకత్వ లక్షణాలు, మాటల్లోని కాఠిన్యం తగ్గినట్లు తెలుస్తోంది. మాట కూడా తడబడుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సోమవారం నామినేషన్​ వేశాక తొలిసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అయితే మాటల్లో తడబాటు స్పష్టంగా కనిపించింది. ఇప్పుడే ప్రమాణం చేసి వచ్చామని ఆమె చెప్పడం ఇందుకు అద్దం పడుతోంది.

అయితే, చాలా రోజుల తర్వాత మీడియా ఎదుటకు రావడంతో విజయశాంతి కాస్త తడబడినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అతి త్వరలోనే రాములమ్మ తిరిగి తన మార్క్ ను తప్పక చూపిస్తారని, తన బలమైన గళాన్ని వినిపిస్తారని సెలవిస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Parliament Sessions | డీలిమిటేషన్, మణిపూర్ అల్లర్లపై దద్దరిల్లిన పార్లమెంట్

Vijayashanthi : ఎవరీ రాములమ్మ..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పార్లమెంటులో పోరాడిన వారిలో కేసీఆర్ తర్వాత విజయశాంతి ఒకరు. బీఆర్​ఎస్​(నాటి టీఆర్​ఎస్​)లో అప్పటి ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత ఆధిపత్య పోరు భరించలేక ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అయితే అందులో సరైన గుర్తింపు లభించకపోవడంతో కాంగ్రెస్​లో చేరారు.

Vijayashanthi : అసలు పేరు ఏంటంటే..

విజయశాంతి తెలుగు సినీ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలిగా అందరికీ సుపరిచితం. తన 30 సంవత్సరాల సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ తదితర భాషా చిత్రాలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించారు. విజయశాంతి జూన్ 24, 1966న వరంగల్లో జన్మించారు. మద్రాసులో పెరిగారు. విజయశాంతి అసలు పేరు శాంతి. ఆమె పిన్ని విజయలలిత అలనాటి తెలుగు సినిమా నటి. విజయ అనే పదాన్ని తన పిన్ని విజయలలిత పేరు నుంచి తీసుకున్నారు.

Vijayashanthi : కిరణ్​ బేడీ స్ఫూర్తితో..

విజయశాంతి 1979లో తొలిసారి కథానాయికగా నటించే నాటికి ఆమె వయసు కేవలం పదిహేనేళ్లు మాత్రమే. 1990 జూన్ నెలలో వచ్చిన కర్తవ్యం సినిమా విజయశాంతి నట జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. ఐపీఎస్​ అధికారిణి కిరణ్ బేడీ స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించారు. 1997లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఒసేయ్​ రాములమ్మతో పల్లెల్లోని ఆడపడుచుల మదిలో నిలిచిపోయారు.

Vijayashanthi : రాజకీయ అరంగేట్రం..

  • 1998లో విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చారు. మొదట భారతీయ జనతా పార్టీలో చేరారు.
  • తెలంగాణ రాష్ట్ర సాధన లక్షంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. 2009లో తన పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితి(ప్రస్తుత బీఆర్​ఎస్​)లో విలీనం చేశారు.
  • 2009లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు.
  • పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటున్నారనే ఆరోపణలపై విజయశాంతిని 2013లో టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు.
  • ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
  • 2020 డిసెంబరు 7న తిరిగి భారతీయ జనతా పార్టీలో చేరారు. 2023 నవంబరు 15న బీఆర్​ఎస్​కు రాజీనామా చేస్తూ అప్పటి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డికి రాజీనామా లేఖ పంపారు.
  • నవంబరు 17, 2023న హైదరాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో తిరిగి కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. మరుసటి రోజు అంటే.. నవంబరు 18న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌, కన్వీనర్‌గా నియమితులయ్యారు.
Advertisement