అక్షరటుడే, న్యూఢిల్లీ: అత్యంత భారీ భద్రత, అంతకు మించిన ప్రోటోకాల్ కు కేరాఫ్ గా నిల్చి హైఎండ్ ఈవెంట్స్ కు మాత్రమే వేదికయ్యే రాష్ట్రపతి భవన్.. ఇప్పుడో పెళ్లి వేడుకకు ముస్తాబయింది. ఫిబ్రవరి 12న(నేడు) సీఆర్పీఎఫ్ అధికారి పూనమ్ గుప్తా వివాహం రాష్ట్రపతి భవన్ లో జరగనుంది. ఇది చారిత్రాత్మకమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు.
లిమిటెడ్ మ్యారేజ్ ఈవెంట్ గా..
పూనమ్ గుప్తా రాష్ట్రపతి భవన్ లో పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ఆమెకు కాబోయే భర్త అవనీష్ కుమార్ జమ్మూకశ్మీర్ లో అసిస్టెంట్ కమాండర్. పూనమ్ గుప్తా సేవలు, ఆమె ప్రవర్తనకు ముగ్ధురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన రాష్ట్రపతి భవన్ ను పూనమ్ జీవితాంతం గుర్తుంచుకునేలా పెళ్లి వేదికగా మార్చి అద్భుతమైన బహుమతినిస్తున్నారు. పూర్తి భద్రతా తనిఖీలు నిర్వహించి వరుడు, వధువు కుటుంబాల సభ్యులు, ఇతర స్నేహితులతో లిమిటెడ్ మ్యారేజ్ ఈవెంట్ గా పూనమ్ పెళ్లి తంతు కొనసాగించనున్నారు.
2020లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జోక్యంతో..
గతంలోనూ ఇలాంటి ఆకట్టుకునే ఘటన జరిగింది. 2020 జనవరి నెలలో అమెరికాకు చెందిన ఆష్లే హాల్ కొచ్చిలోని ఫైవ్ స్టార్ హోటల్ లో వివాహం చేసుకోవాలని ప్లాన్ వేసుకున్నారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక ఆ సమయంలోనే అక్కడ రాష్ట్రపతి కోవింద్ పర్యటనకు వెళ్లడంతో.. ఆ హోటల్ ను రాష్ట్రపతి భద్రత కోసం రిజర్వ్ చేశారు కాబట్టి.. పెళ్లికి తమ హోటల్ లో వీల్లేదని యాజమాన్యం చెప్పేసింది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఆష్లే ట్విట్టర్ లో రాష్ట్రపతి అఫీషియల్ ఖాతాకు ట్యాగ్ చేస్తూ సాయం కోరారు. అలా విషయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దృష్టికెళ్లింది. ఆయన ఆదేశాలతో రాష్ట్రపతి భవన్ అధికారులు తక్షణమే స్పందించారు. అలా రాష్ట్రపతి భవన్ లో ఆష్లే పెళ్లికి వేదికైంది.
మదర్ థెరీసా క్రౌన్ కాంప్లెక్స్ లో వేడుకలు
ఇప్పుడు రాష్ట్రపతి భవన్ లోని మదర్ థెరీసా క్రౌన్ కాంప్లెక్స్ లో పూనమ్ గుప్తా వివాహ వేడుకలు జరగనున్నాయి. పూనమ్ గుప్తా 2018 యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పరీక్షలో 81వ ర్యాంక్ సాధించి సీఆర్పీఎఫ్ లో అసిస్టెంట్ కమాండెంట్ గా సేవలందిస్తున్నారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్ లోని జివాజీ విశ్వవిద్యాలయంలో బీఎడ్ పూర్తి చేశారు. గణితంలో గ్రాడ్యుయేషన్, ఆంగ్ల సాహిత్యంలో పీజీ పూర్తి చేశారు. 2024 గణతంత్ర వేడుకల కవాతులో సీఆర్పీఎఫ్ మహిళా బృందానికి నాయకత్వం వహించారు.
పూనమ్ గుప్తా ఇన్ స్టా అకౌంట్ ద్వారా మహిళలను చైతన్యపర్చుతారు. పలు అంశాల్లో అవగాహన కల్పించడం వంటి వాటితో సోషల్ మీడియాలోనూ ప్రోయాక్టివ్ ఉమెన్ గా పేరు తెచ్చుకున్నారు. బీహార్ లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనూ కమాండెంట్ గా నాయకత్వం వహించారు.