అక్షరటుడే, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి కొనసాగుతున్న వేళ.. తెలంగాణలో రజాకార్ చిత్రం విడుదల కావడం సంచలనంగా మారింది. ప్రత్యేకంగా భాజపా నేతలు ఈ చిత్రాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారు సినిమాను చూసి మిగితా వారు కూడా సినిమా చూడాలని ప్రచారం చేయడం ఇందుకు నిదర్శనం.
రజాకార్ల దురాగతాలకు అద్దం పట్టేలా..
ఇండియాలో విలీనానికి ముందు హైదరాబాద్ సంస్థానంలో ఏం జరిగింది? రజాకార్ల అకృత్యాలు ఎలా సాగాయనే కథాంశంతో తెరకెక్కిన రజాకార్ మూవీ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీకి యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు. బాబీసింహ, అనసూయ, ఇంద్రజ, వేదిక కీలక పాత్రలు పోషించారు. చారిత్రక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఖాసీం రజ్వీ దురాగతాలు
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇండియాలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసేందుకు ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ అంగీకరించరు. రజాకార్ల సాయంతో స్వతంత్రంగానే హైదరాబాద్‌ను పాలించాలని నిజాం నవాబ్ నిర్ణయించుకుంటారు. ఖాసీం రజ్వీ నాయకత్వంలో రజాకర్లు హిందువులను ముస్లింలుగా మార్చేందుకు కుట్రలు పన్నుతారు. నిజాం ప్రధాని లాయక్ అలీ కూడా ఖాసీం రజ్వీని సమర్థిస్తారు. ఉర్దూ తప్ప మిగిలిన భాషలు మాట్లాడకూడదని కట్టడి చేస్తారు. తమకు ఎదురుతిరిగిన ప్రజలను రజాకర్లు దారుణంగా అంతమొందిస్తారు. శిస్తుల పేరుతో ప్రజలను దోచుకోవడం మొదలుపెడతారు. దీంతో రజాకర్లకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ, రాజిరెడ్డి, శాంతవ్వతో పాటు చాలా మంది నాయకులు ఎలాంటి పోరాటం సాగించారు? రజాకర్ల కుట్రలను సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఎలా తిప్పికొట్టారు.. నెహ్రూ అంగీకరించకపోయినా.. వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో ఏ విధంగా విలీనం చేశారు.. నిజాం నవాబ్ విలీనానికి అంగీకరించారా.. మతకల్లోలాలు సృష్టించాలని అనుకున్న ఖాసీం రజ్వీ కుట్రలను పటేల్ ఎలా అడ్డుకున్నారు.. అన్నదే ఈ రజాకర్ మూవీ కథాంశం.
యథార్థ ఘటనలతో..
నిజాం పాలనలో రజాకార్లు ఎలాంటి దురాగతాలు, హింసలకు పాల్పడ్డారనే అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యథార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు ఈ కథ రాశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన చాలా మంది యోధుల జీవితాలతో భావోద్వేగ పూరితంగా ఈ సినిమా సాగుతుంది. ఓ వైపు ప్రజా పోరాటం, మరోవైపు రజాకర్ల దురాగతాలు వీటికి సమాంతరంగా హైదరాబాద్‌ను ఇండియాలో విలీనం చేసేందుకు పటేల్ చేసిన ప్రయత్నాల చుట్టూ కథ అల్లారు. బైరాన్‌పల్లి, గుండ్రాన్‌పల్లి, పరకాల జెండా ఉద్యమం, ఈశ్వరయ్య, గండయ్య గ్యాంగ్ సాహసంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా రజాకార్లను ఎదురించి ప్రజలు సాగించిన పోరాటాన్ని కళ్లకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించారు. వారి పోరాటాన్ని అణిచివేసేందుకు రజాకర్లు చేసిన హింస, రక్తపాతం మనసుల్ని కదిలిస్తాయి. తెలుగు మాట్లాడిన పిల్లలను రజాకార్లు క్రూరంగా హింసించడం, బతుకమ్మ ఆడిన మహిళల్ని వివస్త్రలు చేయడం, మానభంగం, మారణహోమం లాంటి ఘోరాలను ఈ సినిమాలో వాస్తవిక కోణంలో చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్.
ప్రతి ఒక్కరు హీరోలే..
రజాకార్ సినిమాలో ప్రత్యేకంగా హీరోలు అంటూ ఎవరూ లేరు. ప్రతి పది, పదిహేను నిమిషాలకు ఓ పాత్రను తెరపైకి తీసుకొస్తూ ఆసక్తికరంగా కథను ముందుకు నడిపించారు డైరెక్టర్. తెలంగాణ సాయుధ పోరాటంలో బాగా ప్రాచుర్యం పొందిన వారి జీవితాల్ని, చరిత్రలో నిలిచిపోయిన కొన్ని సంఘటనలను సినిమాలో చూపించారు. చరిత్రను వక్రీకరించకుండా యథార్ఠంగా ఏం జరిగిందో అదే చెప్పేందుకు తపన పడ్డారు. రజాకర్ సినిమాలో చూపించినవన్నీ చాలా వరకు తెలిసిన కథలే అయినా.. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేలా చిత్రీకరించారు. షోయబుల్లాఖాన్, చాకలి ఐలమ్మ, రాజారెడ్డితో పాటు చాలా మంది నాయకుల పోరాటపఠిమను తెరపై స్ఫూర్తిదాయకంగా చూపించే ప్రయత్నం చేశారు.

అసంపూర్తిగా సాయుధ పోరాటం
ఖాసీం రజ్వీతో పాటు రజాకార్లను విలన్స్‌గా చూపించే ప్రయత్నంలో కొన్ని చోట్ల హింస మీతిమీరినట్లుగా అనిపిస్తుంది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని పూర్తిగా కాకుండా అసంపూర్తిగా కేవలం కొన్ని కోణాలు మాత్రమే సినిమాలో స్పృశించినట్లుగా అనిపిస్తుంది. పూర్తి సినిమాగా కాకుండా.. ఎపిసోడ్స్‌గా సాగడంతో కొన్ని చోట్ల సీన్ల మధ్య అనుబంధం దెబ్బతిందనే భావన కలుగుతుంది.
నటనతో మెప్పించి..
సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ నటనతో మెప్పించే ప్రయత్నం చేశారు. రాజన్నగా బాబీసింహ, పోచమ్మగా అనసూయ, శాంతవ్వగా వేదిక, ఐలమ్మ పాత్రకు ఇంద్రజ ప్రాణం పోశారు. ఈ సినిమాలో నటన పరంగా పరిశీలిస్తే.. ఖాసీం రజ్వీగా రాజ్ అర్జున్ ప్రత్యేకత చాటారు. ప్రతి నాయకుడి పాత్రలో ఆయన నటన, ఎక్స్‌ప్రెషన్స్ భయపెడతాయి. వల్లభాయ్ పటేల్ పాత్రలో రాజ్ సప్రు మెప్పించారు. మకరంద్ దేశ్‌పాండే, జాన్ విజయ్‌తో పాటు చాలా మంది ఆర్టిస్టులు సినిమాలో కనిపిస్తారు.
బ్యాక్ గ్రౌండ్ సంగీతం అదరహో
సాంకేతికపరంగా భీమ్స్ పాటలు, బీజీఎమ్.. దర్శకుడు రాసుకున్న కథలోని భావాన్ని బలంగా ప్రదర్శించేందుకు దోహదపడ్డాయి. 1947, 1948 నాటి కాలాన్ని కళ్లకు కట్టినట్లుగా విజువల్స్, గ్రాఫిక్స్ ద్వారా సినిమాలో సహజంగా చూపించారు. తెలంగాణ విముక్తి పోరాట చరిత్రలో నిలిచిపోయిన చాలా మంది పోరాట యోధులు, సంఘటనలకు చక్కటి దృశ్యరూపంగా రజాకార్ మూవీ నిలుస్తుంది. చరిత్ర తెలిసిన వారికి ఈ మూవీ ఎక్కువగా కనెక్ట్ అవుతుంది.