అక్షరటుడే, వెబ్డెస్క్: UKRAINE| అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ ఇటీవల మీడియా ఎదుటే వాగ్వాదానికి దిగడం తెలిసిందే. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని నివ్వెరపర్చింది.
డోనాల్డ్ ట్రంప్ తో భేటీ వివాదంగా మారడంతో వైట్ హౌస్ నుంచి జెలన్స్కీ ని బయటకు పంపించేశారు. కాగా, తాజాగా అగ్రరాజ్యంతో సంబంధాలపై ఉక్రెయిన్ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సిఫారసు చేసిన ఒప్పందానికి తాను సిద్ధమేనన్నారు. దీనికితోడు అమెరికాకు ఉక్రెయిన్ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని చెప్పుకొచ్చారు.
UKRAINE| చర్చల అనంతరం నిర్ణయం..
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపుపై ఆదివారం లండన్ లో ఐరోపా దేశాధినేతలు చర్చలు జరిపారు. తదనంతరం జెలెన్స్కీ మాట్లాడారు. అమెరికాతో సత్సంబంధాలను కాపాడుకోగలనన్నారు. సయోధ్య కోసం ట్రంప్ ఆహ్వానిస్తే భేటీకి వెళ్తానని అన్నారు. ఖనిజాల ఒప్పందంపై ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే దానిపై సంతకం చేస్తానని జెలెన్స్కీ చెప్పారు.
UKRAINE| వీడియో సందేశం విడుదల..
ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో విడుదల చేశారు. ‘ఐరోపా నుంచి మాకు పూర్తి మద్దతు ఉంది. శాంతి పునరుద్ధరణపై అందరం ఐక్యంగా ఉన్నాం. ప్రస్తుతం మాకు భద్రతా హామీ కావాలి. ఈ విషయంలో యూకే, ఐరోపా సమాఖ్య, తుర్కియే తదితర దేశాలు కృతనిశ్చయంతో ఉన్నాయి. అమెరికా ప్రాధాన్యం కూడా అర్థం చేసుకోవాలి. యూఎస్ నుంచి అందుతున్న సాయానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. మా స్వాతంత్ర్యాన్ని కాపాడుతున్న వారికి కృతజ్ఞతలు.’ అంటూ జెలెన్స్కీ వీడియో సందేశంలో మాట్లాడారు.